Mobile Popup Ad
Mobile Popup Ad

వీబీజీ రామ్‌జీపై కోర్టుకెళ్లడం దుర్మార్గం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. వీబీజీ రామ్‌జీ (VBG RAM G) పథకాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించడం దుర్మార్గమని ఆరోపించారు. ఈ పథకం ద్వారా పేదలకు మేలు జరగడంతో పాటు గ్రామాలలో  ఆస్తుల సృష్టి జరుగుతుందని, కేంద్రానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. శుక్రవారం కరీంనగర్‌లోని 37వ డివిజన్‌లో రూ.77 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. షాషామహల్ ప్రాంతంలో ఓపెన్ జిమ్‌ను కూడా ప్రారంభించారు.

కరీంనగర్ అభివృద్ధికి భారీ నిధులు

కరీంనగర్ అభివృద్ధికి మరో వారంలో రూ.50 కోట్ల యూడీఎఫ్ నిధులతో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. మరో మూడు నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్లతో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.22 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని, అందులో రహదారుల అభివృద్ధికే రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

పొన్నం వ్యాఖ్యలపై కౌంటర్

యూసీఎఫ్ నిధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపానికి నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 17 ప్రాజెక్టులలో కరీంనగర్‌కు చోటు దక్కడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరీంనగర్ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుండటాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి “మ్యాచ్ ఫిక్సింగ్” రాజకీయాలు చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రెండు పార్టీల డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే ఈ రెండు పార్టీల మధ్య కుమ్మక్కుకు నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ కేసు విచారణను వేగవంతం చేసి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో  విద్యార్థులు, ఉపాధ్యాయులకు బ్రేక్‌ఫాస్ట్, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే అదే సమయంలో 10 వేల పాఠశాలలను మూసివేయాలనే ఆలోచన దురదృష్టకరమని విమర్శించారు. పాఠశాలలను మూసివేయడం కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతం చేయాలని సూచించారు. అలాగే సింగరేణిలో బొగ్గు అక్రమాలపై తక్షణమే విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసినా విచారణ ప్రారంభించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతే కేంద్రంతో విచారణ జరిపించాలని కోరారు.

Read Also: యూజర్‌నేమ్ ఫీచర్‌ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్‌లకు నోటీసులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>