కలం, వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆలయాలను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. దేవుళ్ల ఆభరణాలు, హుండీ డబ్బులు కాజేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాసర ఆలయంతో పాటు కోరుట్ల, పలు గ్రామాల్లోని చిన్న చిన్న ఆలయాల్లో దొంగతనాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఏకంగా రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. ఇక్కడ ఈ రెండు ఆలయాలు పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటం గమనార్హం.
జిల్లాలోని హుస్నాబాద్ (Husnabad)లో ఉన్న మార్కండేయ ఆలయం, అభయ వీరాంజనేయ ఆలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా ఇలా చోరీకి పాల్పడటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. స్థానిక సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

