కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ (Rayalaseema Steel Plant) నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణానికి కాంక్రీటు వేసి ఆయన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రెండు దశల్లో నిర్మించనున్న ఈ మెగా స్టీల్ ప్లాంట్ కోసం JSW సంస్థ రూ. 16,350 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ కర్మాగారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రాంతంలోని దాదాపు 2,500 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఉక్కు పరిశ్రమతో పాటు పర్యావరణ హిత ఇంధన రంగానికి ప్రాధాన్యతనిస్తూ, అదే ప్రాంగణంలో 3,850 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌కు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కడప జిల్లా పారిశ్రామిక హబ్‌గా మారడమే కాకుండా, రాయలసీమ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Read Also: చీము, నెత్తురు ఉంటే.. రాజీనామా చెయ్ జూపల్లి: హరీశ్ రావు
Follow Us On: Instagram

