కలం, వెబ్‌డెస్క్: రాష్ట్ర మంత్రులు గురుకులాల టెండర్లపై చర్చకు సవాల్ విసిరి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. మంత్రులు, బీఆర్ఎస్ నేతల సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మంత్రులు సవాల్ చేస్తేనే తామంతా ఉదయం 10 గంటలకే తెలంగాణ భవన్ వద్దకు వచ్చి కూర్చున్నామన్నారు. ఇక బీఆర్ఎస్‌తో చర్చకు సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పారిపోయాడని ఎద్దేవా చేశారు.
ఈ సవాళ్ల నడుమ సందట్లో సడేమియా అన్నట్టు మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కే వస్తానని చెప్పి తోక ముడిచారని విమర్శించారు. ఇక మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ పిలిచినందుకు గన్ పార్క్‌కు బయలుదేరిన హరీష్ రావు సహా ఇతర నేతలను గేటు దాటక ముందే దుర్మార్గంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో చర్చ అంటే మంత్రులకు ఎందుకు ఇంత భయమని ప్రశ్నించారు. పాలకులకు దమ్ముంటే తక్షణమే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టాలని డిమాండ్ చేశారు. గత 30 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగా, వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని సవాల్ విసిరారు.
చర్చకు పిలిస్తే రాష్ట్ర ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకురావాలని అనుకున్నామని, అయితే ప్రభుత్వానికి తమతో చర్చకు వచ్చే దమ్ము లేదని కేటీఆర్ అన్నారు. అలాంటి చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, ఈ మంత్రులకు కనీసం అక్కడికైనా వచ్చి చర్చించే దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు. గన్ పార్క్‌కు వెళ్లేందుకు తాను సిద్ధమని, అయితే తాను వచ్చే వరకు జూపల్లి అక్కడే ఉంటారా అని ప్రశ్నించారు. తీరా తాను గన్ పార్క్ వెళ్లిన తర్వాత చార్మినార్ వద్దకు రావాలని అంటారేమోనంటూ సెటైర్లు వేశారు. తక్షణమే హరీశ్ రావుతో సహా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ నాయకులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

