కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా దేవరకద్ర (Devarakadra) మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం భవనాన్ని తెలంగాణ హైకోర్టు, మహబూబ్‌నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి న్యాయమూర్తి ఎన్.వి. శ్రావణ్ కుమార్, హైదరాబాద్ నుండి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవితో కలిసి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
స్థానికంగా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం. ప్రేమలత, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, రిబ్బన్ కట్ చేసి న్యాయస్థానం భవనాన్ని ప్రారంభించారు. కొత్త న్యాయస్థానం ప్రారంభం ద్వారా దేవరకద్ర మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని, కేసుల విచారణ వేగవంతం కావడంతో పాటు ప్రజలకు సమయపాలనతో కూడిన న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్పీ జానకి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి(డీఎల్‌ఎస్‌ఏ) ఇందిర, ఇతర అధికారులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

