Mobile Popup Ad
Mobile Popup Ad

కనిపించని వాన జాడ.. సగానికి పడిపోయిన సాగు!

కలం, తెలంగాణ బ్యూరో: నైరుతి రుతుపవనాలు గతంతో పోలిస్తే ఈసారి ముందుగా వచ్చాయి. తెలంగాణలోకి జూన్ మొదటివారంలోనే ప్రవేశించాయి. ఆ ఆనందం ఒకటీ రెండు రోజులు కూడా మిగలలేదు. రుతుపవనాలు అలా వచ్చి అటే వెళ్లిపోయాయి. నెలరోజులవుతున్నా చినుకు జాడ లేదు. ఈపాటికే వ్యవసాయ (Telangana Agriculture) పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతన్న.. ఆకాశం దిక్కు దిగాలుగా చూస్తున్నాడు. వానలు రాక.. పనులు కాక.. తిప్పలు పడుతున్నాడు. జూన్ మొత్తం ఎత్తిపోయింది. జులైలో కూడా వర్షాలు పడుతాయన్న నమ్మకం లేదు. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. మరోవైపు ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. నారు మళ్లకు కూడా నీరు అందడం లేదు. విత్తుకున్న విత్తనాలు తడిలేక భూమిలోనే మాడిపోతున్నాయి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, లక్షలాది మంది జీవనోపాధికి మూల స్తంభమైన వ్యవసాయ రంగం (Telangana Agriculture) ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలోనే అనిశ్చితిలో కూరుకుపోయింది. సీజన్ ప్రారంభంలోనే రైతులకు కష్టకాలం వచ్చిపడింది. వర్షాలు లేక సాగు పనులు ముందుకు సాగడం లేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి పావు వంతు కూడా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. గతేడాది ఈసారికి 80 వేల ఎకరాలకుపైనే వరి సాగు ప్రారంభమైతే ఈసారి అది 30 వేల ఎకరాలకే పరిమితమైంది. వర్షపాతం సైతం గతేడాది సరిగ్గా ఇదే సమయానికి యావరేజ్‌గా 100 మి.మీ. కురిస్తే.. ఈసారి మాత్రం 84 మి.మీ. దగ్గరే ఆగిపోయింది. 26 జిల్లాల్లో నార్మల్‌ కంటే తక్కువే కురిసింది. ఇక గ్రౌండ్ వాటర్ పరిస్థితి మరీ దయనీయం.

ఎల్‌ నినో ముప్పు

ఈసారి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎల్‌ నినో (El Nino) ప్రభావంతో వర్షాలు ఆశించినంతగా ఉండవని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఆ అంచనాల ప్రకారమే వర్షాలు చాలా చోట్ల కురవలేదు. తెలంగాణ వ్యవసాయ శాఖ తాజా నివేదికల ప్రకారం.. జూన్ 1 నుంచి జూన్ 24 నాటికి రాష్ట్రంలో సగటున 84.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి కురవాల్సిన 101.8 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 17% లోటు. తక్కువ వర్షపాతం కారణంగా వాతావరణం అనుకూలించక, ఊహించిన దానికంటే చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు పనులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది.

మొత్తం 33 జిల్లాల్లో కేవలం 4 జిల్లాల్లోనే (హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మెదక్, వరంగల్, మహబూబాబాద్ లాంటి 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొన్నది. గరిష్టంగా హన్మకొండ జిల్లాలో 75.3% లోటు నమోదుకాగా, సిద్దిపేట జిల్లాలో 65.9% లోటు రికార్డయింది. దీంతో ఆ జిల్లాల్లోని పల్లెల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది.

సగానికి పడిపోయిన వరిసాగు

వర్షాలు సకాలంలో లేకపోవడంతో గతేడాదితో పోలిస్తే సాగు పనుల విస్తీర్ణం సగానికి పైగా పడిపోయింది. వానాకాలం సీజన్ మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 132.44 లక్షల ఎకరాలుగా ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, ఈసారి జూన్ 24 నాటికి కేవలం 14.78 లక్షల ఎకరాల్లోనే (11.16%) విత్తనాలు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో పంటల పనులు నమోదయ్యాయి. ఈసారి సగానికే పరిమితం కావడం వ్యవసాయ రంగం కష్టాల్లో ఉందని చెప్పడానికి నిదర్శనం.

వరి ఉత్పత్తిలో దేశంలోనే రికార్డు స్థాయిలో పంటలు పండించిన ఘనత తెలంగాణకు దక్కింది. ఇతర పంటలతో పోలిస్తే ఇక్కడ వరి సాగే ఎక్కువ. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి నాట్ల పరిస్థితి ఈసారి దయనీయంగా ఉంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 62.47 లక్షల ఎకరాలు కాగా గతేడాది ఇదే సమయానికి 80,021 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. కానీ.. ఈ ఏడాది వర్షాలు, సాగునీరు లేక కేవలం 30,243 ఎకరాలకే (0.48%) పరిమితమైంది. వీటన్నింటినీ వ్యవసాయ శాఖ ద్వారా సేకరించిన ప్రభుత్వం ఇకపైన చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టి సారించింది.

ఇతర పంటల పరిస్థితీ అంతే..!

రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య పంటగా పత్తికి గుర్తింపు. సాధారణ సాగు విస్తీర్ణం 48.93 లక్షల ఎకరాలు. జనరల్‌గా ఈ సమయానికి 18.75 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉందని వ్యవసాయ శాఖ లెక్కలేసింది. గతేడాది 22.14 లక్షల ఎకరాల్లో విత్తనాలు పడి అంచనాను దాటింది. కానీ ఈసారి పరిస్థితి అనుకూలించకపోవడంతో కేవలం పావు వంతుకు సమానమైన 12.60 లక్షల ఎకరాల్లోనే (25.76%) రైతులు విత్తనాలు వేయగలిగారు. సోయాబీన్ సాధారణంగా 4.20 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా కేవలం 24,666 ఎకరాల్లో, మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాలకు గాను కేవలం 30,932 ఎకరాల్లోనే సాగు ప్రారంభమైంది.

జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు.. ఇలాంటి మిల్లెట్ పంటలు గతేడాది ఇప్పటికే రెండు లక్షల ఎకరాలు దాటితే ఈసారి అది 65 వేల ఎకరాల దగ్గరే ఉండిపోయింది. కందులు, పెసలు, మినుములు లాంటి పప్పుదినుసులు గతేడాది ఒకటిన్నర లక్షల ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 70 వేల ఎకరాలూ దాటలేదు. ఆయిల్ సీడ్స్ సైతం లక్షన్నర ఎకరాలకు బదులు పాతికవేల ఎకరాల దగ్గరే ఉంది.

కీలకంగా విపత్తు నిర్వహణ సంస్థ రోల్

వాతావరణపరంగా ఇలాంటి క్లిష్ట సమయంలో వ్యవసాయ శాఖతో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పోషించాల్సిన పాత్ర కీలకం. ఈసారి ఎల్‌ నినో ప్రభావం దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఇంకా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించలేదని సచివాలయ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. రుతుపవనాల ఆలస్యం, తక్కువ వర్షపాతంతో వ్యవసాయ రంగంపై (Telangana Agriculture) పడే ప్రభావం, కరువు లాంటి పరిస్థితులకు ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ తదితరాలపై సిఫారసులు చేయాల్సి ఉంటుంది.

కానీ ఆ ప్రక్రియ మొదలుకాలేదు. ఇస్రో ఉపగ్రహ డేటా, భూగర్భ జల వనరుల శాఖ నివేదికలు, ఐఎండీ అంచనాల ఆధారంగా నిరంతరం జిల్లాల వారీ పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నది. వర్షాలు మరింత ఆలస్యమైతే ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు పనిదినాలు పెంచడం, తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు రవాణా ప్రణాళికలు రచించడం, ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించడం.. ఇవన్నీ తప్పనిసరిగా మారతాయి. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని సూచిస్తున్నది. పలు వేదికల మీద సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా ఇదే విషయాన్ని రైతులకు చెప్తున్నారు.

రాష్ట్రంలో సాగు పనులు జూన్ 24 నాటికి (ఎకరాల్లో..!)

పంట              గతేడాది          ఈసారి
వరి                80,021            30,243
మిల్లెట్స్          1,22,614        34,939
పప్పుధాన్యాలు  1,40,630         69,063
ఆయిల్ సీడ్స్   1,43,396         25,429
పత్తి               22,14,372       12,60,315
మొత్తం          28,38,416        14,78,120

Read Also:  తెలంగాణ – కర్నాటక.. బోర్డర్‌లో ‘చెత్త’ పంచాయితీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>