Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంపై కామెంట్స్: కాంగ్రెస్ నేతకు షోకాజ్ నోటీసు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి (Katti Venkataswamy)కి షాక్ తగిలింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణా చర్యల కమిటీ (DAC) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఇటీవల ఒక టీవీ చర్చా కార్యక్రమంలో కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా, ముఖ్యమంత్రిని కించపరిచేలా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించింది.

సీనియర్ నాయకుడిగా పార్టీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ, ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని పార్టీ అంతర్గత వేదికలపై, టీపీసీసీ అధ్యక్షుడు లేదా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని క్రమశిక్షణా కమిటీ స్పష్టం చేసింది. అలా కాకుండా బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని నోటీసులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి షోకాజ్ నోటీసును కత్తి వెంకటస్వామి (Katti Venkataswamy)కి పంపారు. మీపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అందులో కోరారు. నోటీసు అందిన మూడు రోజుల్లోగా పూర్తి స్థాయి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా సరైన సమాధానం రాకపోతే, కాంగ్రెస్ పార్టీ నిబంధనావళి, క్రమశిక్షణా విధానాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది.

Read Also:  తెలంగాణ – కర్నాటక.. బోర్డర్‌లో ‘చెత్త’ పంచాయితీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>