కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (ACB) అధికారులు పలువురు సబ్ రిజిస్ట్రార్ల ఆస్తులపై ఫోకస్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు, శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని ప్రసాద్ నివాసంతో పాటు, అతని దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా సోదాలు జరిపారు. గత నెల 4, 5 తేదీల్లో కార్యాలయాల్లో చేపట్టిన సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ (ACB) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టిన ఏసీబీ, అందులో లభించిన సమాచారం ఆధారంగా ఇప్పుడు సంబంధిత అధికారుల ఆస్తులు, నివాసాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్‌పై ఏసీబీ ఫోకస్ చేసింది.
చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నవంబరు 4, 5 తేదీల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పుడు లభించిన రికార్డులు, డాక్యుమెంట్లు, ఫోన్‌పే లావాదేవీల వివరాలు ఆధారంగా ఇప్పుడు ప్రసాద్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అనంతపురం జిల్లాలోని ప్రసాద్ నివాసంలో ఉదయం నుంచి సోదాలు మొదలుపెట్టిన అధికారులు, ఆస్తి పత్రాలు, నగదు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ప్రసాద్ దగ్గర ప్రైవేట్‌గా పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి.


