కలం, హనుమకొండ : పేదల కోసం భూ పోరాటాలను తీవ్రతరం చేస్తామని సీపీఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు భారీ పికెటింగ్ నిర్వహించాయి. ఉదయం 9 గంటలకే కలెక్టరేట్ కు చేరుకున్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు.. అధికారులను, సిబ్బందిని కలెక్టరేట్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచే పికెటింగ్ నిర్వహించడంతో ప్రధాన రోడ్డు పైనే వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేదల ఇళ్ల స్థలాల సాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇళ్ల స్థలాలకు పట్టాలు సాధించే వరకు ప్రభుత్వం, అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ మాఫియా, కబ్జా దారుల నుంచి కాపాడి, ఆ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేది వామపక్షాలేనని వెల్లడించారు.
భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా భూ పోరాటాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాంటి భూములలో ప్రభుత్వం పేదలకు నివాస స్థలాలుగా కేటాయించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, పేదల దాడులు ఆపాలని హెచ్చరించారు.
అనంతరం పికెటింగ్ నిర్వహిస్తున్న వామపక్షాల నాయకులను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా వామపక్ష పార్టీల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో సహా వామపక్షాల నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, జి.ప్రభాకర్ రెడ్డి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదా లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు పాల్గొన్నారు.

