Mobile Popup Ad
Mobile Popup Ad

టీచర్లు సమయానికి స్కూళ్లకు వెళ్ళాలి.. ఖుష్బూ గుప్తా వార్నింగ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల నమోదు, హాజరు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) సమీక్ష నిర్వహించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు (ఎంఈఓలు), కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మీటింగ్ నిర్వహించారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Collector Khushboo Gupta) మాట్లాడుతూ.. టీచర్లు సమయపాలన పాటిస్తూ, నిర్దేశిత టైమ్‌ టేబుల్ ప్రకారం తరగతి గదులకు సకాలంలో హాజరై నాణ్యమైన బోధన అందించాలని ఆదేశించారు. పాఠశాల పని వేళల్లో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా తరగతి గదిలో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో నైట్ డ్యూటీ పూర్తి చేసిన ఉపాధ్యాయుల స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి బోధనకు అంతరాయం కలగకుండా చూడాలని ప్రత్యేక అధికారులను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

తప్పనిసరిగా పూర్తి చేయాలి..

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ‘బడిబాట’ కార్యక్రమంలో విద్యార్థుల నమోదు లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్ని ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల అపార్ (APAAR) ఐడీ నమోదు, ఆధార్ సీడింగ్, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేషన్ (MBU) పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసి 6వ తరగతిలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న డ్రాప్‌బాక్స్ విద్యార్థులందరికీ వెంటనే ప్రవేశాలు కల్పించాలని సూచించారు.

విద్యార్థులు, సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) హాజరును సమీక్షించిన సందర్భంగా సీసీ కుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో హాజరు శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించి, సంబంధిత మండల విద్యాధికారులు తక్షణమే మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు తీసుకునే ఎర్న్డ్ లీవ్ (EL), మెడికల్ లీవ్‌లకు ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. సంబంధిత ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయుల అనుమతి అనంతరమే సెలవులు వినియోగించుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకల్లా ఉపాధ్యాయుల హాజరు నివేదికను సిద్ధం చేసి సమీక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

గతేడాది అంచనాలతో పోల్చాలి..

లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (LIP), ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) అమలును సమీక్షిస్తూ, గత విద్యా సంవత్సరపు అంచనా ఫలితాలను ఈ నెల 18వ తేదీన నిర్వహించే అంచనాతో పోల్చి విద్యార్థుల అభ్యాసంలో వచ్చిన పురోగతిని విశ్లేషించాలని సూచించారు. గత మూడు నెలలుగా మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించిన పాఠశాలల తనిఖీలను సమీక్షించిన కలెక్టర్, ప్రతి ఎంఈఓ నెలకు కనీసం 16 పాఠశాలలను, ప్రతి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కనీసం 12 పాఠశాలలను సందర్శించి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. లక్ష్యాలకు తగ్గట్టుగా పర్యటనలు చేయని అధికారులు తమ పనితీరును మెరుగుపర్చాలని సూచించారు.

ప్రీ-ప్రైమరీ తరగతుల నమోదును సమీక్షిస్తూ, నమోదు లేని పాఠశాలల్లో కనీసం 10 మంది విద్యార్థులను చేర్పించాలని సూచించారు. 15 మందికంటే తక్కువ నమోదు ఉన్న పాఠశాలలు, అలాగే గత మూడు సంవత్సరాలుగా తక్కువ నమోదు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి విద్యార్థుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కేజీబీవీ, పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న మరమ్మతులు, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను అత్యంత ప్రాధాన్యంతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

2-3 వారాల్లో పూర్తి చేయాలి..

ముఖ్యంగా గండీడ్, మహబూబ్‌నగర్ అర్బన్, భూత్పూర్, సీసీ కుంట కేజీబీవీలు, అలాగే పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ అడ్డాకల్, ఎంపీపీఎస్ జడ్చర్ల, జడ్పీహెచ్‌ఎస్ కోయిల్‌కొండ పాఠశాలల పనులను వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులపై ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ పురోగతి నివేదికలు పంపాలని, మండల విద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

పాఠశాలలకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందాయా అనే అంశాన్ని సమీక్షించిన కలెక్టర్, నిల్వ ఉంచకుండా వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, ఎంఈవో శ్రీనివాస్, సీఎంవో సుధాకర్ రెడ్డి, జీఈసీవో అస్రాఖాద్రీ, ప్లానింగ్ కోఆర్డినేటర్ ప్రశాంత్, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఎస్‌వోలు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఎంపీ ఇంట్లో సోదాలు.. బంగారు లోదుస్తులు, కోట్ల నగదు సీజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>