కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజల సమస్యలను గ్రామస్థాయికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో ‘ప్రజావాణి’ (Prajavani) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లావ్యాప్తంగా 61 మండల కేంద్రాలలోని ఎంపీడీవో కార్యాలయాలు, రైతు వేదికల్లో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. తొలి రోజు అధికారుల హాజరు, ఏర్పాట్లు బాగానే ఉన్నప్పటికీ ప్రజల నుంచి స్పందన మాత్రం అంతంతమాత్రంగానే కనిపించింది. తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయం, వైద్యం, విద్యుత్, పంచాయతీరాజ్, హౌసింగ్ తదితర 23 ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు ప్రజావాణికి హాజరయ్యారు. పింఛన్లు, సంక్షేమ పథకాలు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రయాణ భారం తగ్గినా.. స్పందన ఏది?
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు దూర ప్రాంతాల నుంచి వెళ్లే ప్రజలకు ప్రయాణ ఖర్చులు, సమయం, ఇతర ఇబ్బందులు తగ్గించేందుకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించడం సౌకర్యంగా మారింది. అయితే మండల కేంద్రాలలో ప్రజావాణి ప్రారంభమైనప్పటికీ, వివిధ సమస్యలతో కలెక్టరేట్‌కు వచ్చే బాధితుల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన ప్రజలు కేవలం 20 దరఖాస్తులు మాత్రమే సమర్పించారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలోనూ తక్కువ సంఖ్యలోనే వినతులు అందాయి. నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్యాలయాలలో నిర్వహిస్తున్న ప్రజావాణికి కూడా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదని తెలుస్తోంది.
కరీంనగర్ రూరల్‌లో 20 దరఖాస్తులు
కరీంనగర్ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నోడల్ అధికారి వినోద్ కుమార్ అధ్యక్షతన ప్రజావాణి నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి మొత్తం 20 మంది తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. వీటిలో ఎంపీడీవో పరిధిలో 7, ఎంపీవో పరిధిలో 6, వైద్య శాఖలో 1, విద్యుత్ శాఖలో 1, హౌసింగ్ శాఖలో 5 దరఖాస్తులు ఉన్నాయి. ప్రతి దరఖాస్తుకు ఆన్‌లైన్ రశీదు అందించారు. కార్యాలయంలో గదులు ఇరుకుగా ఉండటంతో ఒకేసారి ఒక్కరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతిస్తూ అధికారులు సమస్యలను విని దరఖాస్తులు స్వీకరించారు. వారం రోజులలో దరఖాస్తులను సమీక్షించి సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
సమస్యలు పరిష్కారం కాకపోతే?
మండల స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలతోనే జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నామని పలువురు బాధితులు చెబుతున్నారు. ఖర్చులు, ప్రయాణ ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో కలెక్టరేట్‌కు వెళ్తున్నామని పేర్కొన్నారు. అలాంటి సమస్యలతో వచ్చిన వారిని తిరిగి మండల స్థాయి ప్రజావాణికి పంపిస్తే తమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో మాదిరిగా గ్రామ సభలు నిర్వహించి, ఆర్డీవో స్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వినతిదారులు తమ సమస్యను నేరుగా అధికారుల ముందుంచి, అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని, తమ పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మండల స్థాయి ప్రజావాణి కేవలం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంగా కాకుండా, సమస్యలకు నిర్ణీత సమయంలో పరిష్కారం చూపే వేదికగా మారినప్పుడే ఆశించిన ఫలితం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

