Mobile Popup Ad
Mobile Popup Ad

2029 నాటికి కడప స్టీల్​ ప్లాంట్​ పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

క‌లం, వెబ్‌డెస్క్‌: కడప స్టీల్ ప్లాంట్‌ను 2029 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో జరిగిన ‘ప్రజావేదిక’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి రూ.33 వేల కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చేలా చేసి రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు దాదాపు 40 ఏళ్లు పడుతుందని, ప్రస్తుతం అన్ని శాఖలను గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని చెప్పారు.

పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగానే నెల్లూరుకు 27 పరిశ్రమలు వస్తున్నాయని సీఎం అన్నారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని చెప్తూ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తక్షణమే సిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే ఆడ‌వాళ్ల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్ర‌బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీని ఇకపై గొడ్డలి పార్టీగా పిలవాలని, ఆ పార్టీ నేతలు కులం, మతం, ప్రాంతం పేరిట రోజుకో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ప్రజలు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల అరాచకాలను చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు మూడు రాజధానులంటూ కాలయాపన చేసి ఏమీ చేయలేదని, ఫలితంగా ఏపీ ప్రజలు బయటకు వెళ్తే అవమానాలు పడే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఆమోదం పొందిన అమరావతిని కూడా వారు వ్యతిరేకిస్తున్నారని, ప్రజలందరికీ రాజధాని కావాలి కానీ గొడ్డలి పార్టీకి మాత్రం అవసరం లేదన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లోకి ఆశించిన స్థాయిలో నీళ్లు రావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా సాగాలని, గొడ్డ‌లి పార్టీ నేర‌స్తుల‌ను పెంచి పోషిస్తూ, వారికి అండ‌గా ఉంటుంద‌ని, అలాంటి పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>