కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని పొగమంచు వీడటం లేదు. ఎటుచూసినా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల నిర్మాణాలను ఆపేసినా, పాత వాహనాలపై నిషేధం విధించినా ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయే తప్ప మెరుగుపడటం లేదు. దీంతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ (ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్).
వాయుకాలుష్యం (Air Pollution) తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో గ్రాఫ్-4 చర్యలు అమలవుతున్నాయి. 1 నుంచి 5వ తరగతి పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా, ఆన్లైన్లో పాఠాలు చెప్పాలని, వివిధ కార్యాలయాల్లో పనిచేసే 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఢిల్లీ నిర్ణయించింది. అలాగే హర్యానా, బిహార్, పంజాబ్, యూపీలకు అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు రాకపోకలపై ప్రభావం పడింది. పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజిబులిటీ కూడా తగ్గడంతో అడుగుదూరంలో ఉన్న వాహనాలు సైతం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి.


