కలం, ఢిల్లీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ గుర్తింపు కార్డు (National Citizen Card) తీసుకురానున్నదా?.. ఇందుకు అవసరమైన లీగల్ ప్రొసీజర్ మొదలుపెట్టిందా?.. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు పెట్టనున్నదా?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ‘ఔను’ అనే సమాధానం కేంద్ర హోంశాఖ వర్గాల నుంచి వినిపిస్తున్నది. ప్రస్తుతం ఉనికిలో ఉన్న గుర్తింపు కార్డులన్నీ ఒక్కో రకమైన పర్పస్ కోసం ఉన్నందున.. పౌరసత్వాన్ని ధృవీకరించేవి ఏవీ లేవన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో తీసుకొచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్.. ఇవన్నీ వివాదాల్లో చిక్కుకున్నాయి. దీంతో ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్న బలాబలాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి నేషనల్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు (National Citizen Card) విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. విదేశాంగ శాఖ, హోంశాఖ సంయుక్తగా కసరత్తు చేసి దీనిపై తయారుచేసే నివేదిక, సిఫారసులకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
యూనిఫామ్ ఐడెంటిటీ కార్డ్ సిస్టమ్
దేశవ్యాప్తంగా భారతీయ పౌరులందరికీ జాతీయ గుర్తింపు కల్పించే నేషనల్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు (National Citizen Identity Card) వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు ఢిల్లీ అధికారవర్గాల సమాచారం. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చట్ట సవరణ బిల్లుగా తెస్తుందా లేక కొత్త బిల్లునే తీసుకొస్తుందా?.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కానీ, కేంద్ర హోంశాఖ పరిధిలో జరుగుతున్న సన్నాహాలు, ఇప్పటికే బడ్జెట్లో చేసిన కేటాయింపులతో చర్చ మొదలైంది. విదేశాంగ శాఖ ఇటీవల చేసిన “పాస్‌పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. పౌరసత్వాన్ని ధ్రువీకరించేది కాదు..” అనే కామెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కేంద్రం నేషనల్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఉన్న కార్డులు ఒక్కోటి ఒక్కో పర్పస్
ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు వంటి అనేక గుర్తింపు పత్రాలు ఉన్నా వీటిలో ఏదీ భారత పౌరసత్వాన్ని ఆధారంగా నిర్ధారించేవిగా లేవు. ఒక్కోదానికి ఒక్కో రకమైన వినియోగం ఉన్నది. ఆధార్ కార్డు.. నివాస ధ్రువీకరణ కోసం, పాన్ కార్డు.. పన్ను చెల్లింపుల నిర్ధారణ కోసం, ఓటరు కార్డు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు, రేషన్ కార్డు.. నిత్యావసర వస్తువులు చౌకధరల దుకాణాల నుంచి తీసుకునేందుకు పరిమితమయ్యాయి.
పాస్‌పోర్ట్.. ట్రావెల్ డాక్యుమెంట్‌గా మాత్రమే పరిగణనలో ఉన్నది. సిటిజన్‌షిప్ యాక్ట్ ప్రకారం.. దేశంలోని పౌరులందరి వివరాలను జాతీయ పౌర రిజిస్టర్లో నమోదు చేసి జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేసే వెసులుబాటు ఉన్నది. స్పష్టమైన నిబంధనలూ ఉన్నాయి. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ సిద్ధం చేసి, జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేసే విధానాన్ని ఈ చట్టం నిర్దేశించింది.
బడ్జెట్లో నిధుల కేటాయింపు
ఈసారి బడ్జెట్లో సెన్సస్తో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ వివిధ అవసరాలకు ఖర్చు పెట్టేలా బడ్జెట్లో స్పష్టత ఇచ్చింది. సెన్సస్తో పాటు ఎన్పీఆర్ అవసరాలకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ ప్రకారం.. సెన్సస్ ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ నుంచి స్పష్టమైన నోటిఫికేషన్ వెలువడింది.
కానీ, ఎన్పీఆర్ గురించి మాత్రం ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు. సెన్సస్ రూల్స్ ప్రకారం హౌస్ లిస్టింగ్‌తో పాటు ఎన్పీఆర్ ప్రక్రియ కూడా జరగాల్సి ఉన్నది. బడ్జెట్లో ఎన్పీఆర్ అవసరాల కోసం కేటాయింపులు కూడా ఉన్నాయి. కానీ, ఎన్పీఆర్ ఊసే లేకపోవడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో సైతం ఎన్పీఆర్ అవసరాల కోసం రూ. 3,941 కోట్లను కేటాయించింది. ప్రతిపక్షాల అభ్యంతరాలతో పాటు ప్రజల ఆందోళనల రీత్యా ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది.
Read Also: ఓటు పోతే.. స్కీమ్‌లు కట్!
Follow Us On : WhatsApp

