Mobile Popup Ad
Mobile Popup Ad

అవమానం తట్టుకోలేక పంచాయతీ వర్కర్ ఆత్మహత్యాయత్నం!

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) రూరల్ మండలం అక్కాపూర్ గ్రామంలో వీడీసీ సభ్యుడు బహిరంగంగా బూతులు తిట్టి అవమానించడంతో మనస్తాపానికి గురైన ఓ పంచాయతీ వర్కర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన పిట్ల నారాయణ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మిషన్ భగీరథ నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, గ్రామ మైక్ అనౌన్స్‌మెంట్లు వంటి పలు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

అయితే గ్రామ మైక్ పనిచేయకపోవడంతో పిట్ల నారాయణ వీడీసీ సభ్యుడు బైరి వెంకట్‌కు సమాచారం ఇచ్చాడు. కానీ నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ రోడ్డుపైనే అందరి ఎదుట అసభ్య పదజాలంతో వెంకట్ దూషించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణ పురుగుల మందు తాగాడు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌కు విషయం తెలియజేసినా స్పందన లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గ్రామాల్లో వీడీసీల పెత్తనం రోజురోజుకు పెరిగిపోతోందని, వారి అరాచకాలకు సామాన్యులు బలవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్మల్ జిల్లాలోని కడ్తాల్, తాండ్ర గ్రామాల్లో కూడా వీడీసీ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటనలు మరవకముందే అక్కాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: రూ.30 వేల కోట్లు ఎప్పుడిస్తారు?.. హరీశ్ రావు ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>