Mobile Popup Ad
Mobile Popup Ad

బస్వాపురం బాధితులకు పునరావాసం ప్లీజ్: సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే కుంభం

కలం, భువనగిరి: భువనగిరి నియోజకవర్గ పరిధిలోని కీలక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కుంభం (MLA Kumbam) అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రధాన డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు. బస్వాపురం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలతోపాటు, పిలాయిపల్లి ప్రాంత పర్యావరణ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బస్వాపురం ప్రాజెక్టు (నృసింహస్వామి రిజర్వాయర్) నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద రావాల్సిన పరిహారం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు.

నిధులు లేక నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, తక్షణమే పెండింగ్ నిధులను విడుదల చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సానుకూలంగా స్పందించారు. బస్వాపురం నిర్వాసితులకు న్యాయం చేస్తామని, పెండింగ్‌లో ఉన్న ఆర్‌ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులను త్వరలోనే విడుదల చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లా బండరావిరాల వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి (Pochampally) మండలం పిలాయిపల్లి గ్రామ శివారు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎమ్మెల్యే (MLA Kumbam) తెలిపారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్‌కుమార్ రెడ్డితో కలిసి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న కాలుష్యం కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోందని, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆ డంపింగ్ యార్డును అక్కడి నుంచి తక్షణమే తరలించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ రెండు ప్రధాన సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడంపై ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Read Also: ఇక ఫోన్ నంబర్ అక్కర్లేదు.. వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>