కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా మిడ్జిల్ మండలంలో నిర్వహించిన ఉచిత లంపీ స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్య సిబ్బందితో మాట్లాడి టీకాల కార్యక్రమం పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మిడ్జిల్ మండలంలో పాడి పరిశ్రమపై అధిక సంఖ్యలో రైతులు ఆధారపడుతూ, పాల ఉత్పత్తి గణనీయంగా జరుగుతున్న నేపథ్యంలో కొత్త పశు వైద్య ఉప కేంద్రాల ఏర్పాటు అవసరంపై కలెక్టర్ ఆరా తీశారు.
ఈ ప్రతిపాదనల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశు వైద్య సేవలు, మండలంలో పశుసంవర్ధక రంగం పరిస్థితి, పాల ఉత్పత్తి పెంపునకు చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ (Khushboo Gupta).. స్థానిక మండల పశు వైద్యాధికారి డాక్టర్ శివరాజ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో పశుసంవర్ధక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. ఉచిత లంపీ స్కిన్ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మిడ్జిల్, మల్లాపూర్, వేముల గ్రామాల్లో మూడు నెలలు నిండిన ప్రతి పాడి పశువుకు, దుక్కి దున్నే పశువుకు ఉచితంగా టీకాలు వేశారు.
ఒక్కరోజే మొత్తం 564 పశువులకు టీకాలు అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు లంపీ స్కిన్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం రావడంతో పాటు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, పని సామర్థ్యం దెబ్బతిని రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందని వివరించారు. అలాగే చర్మంపై, నోటిలో బొబ్బలు ఏర్పడి పుండ్లుగా మారడం వల్ల పశువులు మేత, నీరు తీసుకోకుండా బలహీనపడి మృత్యువాత పడే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
మూడు నెలలు దాటిన దూడలు, పెద్ద పశువులకు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా లంపీ స్కిన్ వ్యాధి నిరోధక టీకా వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, మండల పశు వైద్యాధికారి డాక్టర్ అనూప్ శివరాజ్, పశువైద్య సిబ్బంది నర్సింహ, శ్రీనివాస్, పాండు, గోపాలమిత్రలు నరసింహ, వేణుగోపాల్, రామకృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
Read Also: వర్షపు జల్లుల్లో జలపాతాల జోరు.. తెలంగాణలో టాప్ వాటర్‌ఫాల్స్ ఇవే!
Follow Us On: Instagram

