కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బైంసా రూరల్‌కు చెందిన ఏఎస్ఐ దిగంబర్, నిర్మల్ రూరల్‌కు చెందిన ఏఎస్ఐ బాబారావు, డీఏఆర్‌కు చెందిన ఏఆర్ పీసీ ఎం. బాలుడు రిటైర్మెంట్ సందర్భంగా శాలువాలు, మెమొంటోలు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేసిన పోలీసు సిబ్బంది సేవలు శాఖకు ఆదర్శంగా నిలుస్తాయని ఆమె అన్నారు. పోలీసు శాఖ అభివృద్ధికి వారు అందించిన సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఓ యూనుస్ అలీ, ఆర్ఎస్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

