కలం, కరీంనగర్ బ్యూరో : గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ముప్పై సంవత్సరాల పాటు లీజుకు అమ్మి, ఆ వచ్చిన పైసలతోనే రైతు బంధు నిధులు ఇచ్చిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన ఆరోపణ చేశారు. హుస్నాబాద్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు నిధుల పంపిణీ ఏళ్ల తరబడి సాగిందని, కేవలం ఎన్నికల లబ్ధి కోసం, ఓట్ల కోసమే ఎస్ఎంఎస్ ల హడావుడి చేశారని విమర్శించారు. తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఈ రోజు నుండే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదలవుతున్నట్లు మంత్రి ప్రకటించారు.
గతంలో నాలుగు నెలల సమయం..
గతంలో 2018-19 వర్షాకాలంలో మొదటిసారి నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి నాలుగు నెలల ఐదు రోజుల సమయం పట్టిందని గుర్తు చేశారు. అలాగే వివిధ సీజన్లలో రైతు బంధు పూర్తి చేయడానికి ఐదు నెలల పైగా సమయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయని రికార్డులు చూపెట్టారు. గత పదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్లు ఇస్తే, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ముప్పై నెలల కాలంలోనే ఇరవై ఏడు వేల కోట్లు రైతాంగానికి అందించిందని వివరించారు. నిధుల పంపిణీలో తమ ప్రభుత్వం వేగం పెంచిందని, 2025లో కేవలం తొమ్మిది రోజుల్లోనే నిధులు వేశామని, 2026లో రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు అందాయని చెప్పారు. ప్రస్తుత విడతను కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
రైతులకు కేవలం పెట్టుబడి సాయమే కాకుండా, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని, వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, విత్తనాల సరఫరా, విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటు లేకుండా పక్కాగా చూసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎరువుల సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతు వేదిక దగ్గర వ్యవసాయ అధికారులు యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని, హుస్నాబాద్ లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఉదయం ఆరు గంటల నుండే ఫర్టిలైజర్ షాపుల్లో ఎరువులు దొరికేలా చూసే బాధ్యత తమదేనని చెప్పారు.
ఇదే సమయంలో రాజకీయ, ఓటర్ల జాబితా సవరణపై కూడా మంత్రి స్పందించారు. ప్రస్తుతం ఓటరు సవరణ జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ తరఫున అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోకుండా చూస్తామని చెప్పారు. బీహార్, బెంగాల్ లలో బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించిందని, ఇక్కడ కూడా వారి క్యాచర్ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితాను పరిశీలించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు.

