కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) పట్టణంలోని న్యాక్ సెంటర్‌లో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్‌ల(Sewing Machines), పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Mohammed Ali Shabbir) ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాల ద్వారా మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలిచి గౌరవప్రదమైన జీవనం సాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో రూ.1.02 కోట్ల వ్యయంతో మొత్తం 1,700 కుట్టు మిషన్‌లను పంపిణీ చేస్తున్నామని, అందులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్‌లు అందించడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నుడా చైర్మన్ కేశవేణు, రత్నాకర్, జావిద్ అక్రమ్, ఎం.ఏ. పహీం, నయీమ్, కరీం, పాపాఖాన్, హఫీజ్ లయీక్ ఖాన్, హరూన్ ఖాన్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా లబ్ధిదారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

