కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ హైటెక్ సిటీలో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభ ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించే రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి సుమారు 5 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. రెండు గంటల పాటు సభ జరగనుండగా.. ట్రాఫిక్ జాం నేపథ్యంలో శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సాయంత్రం 4.30 గంటల తరువాత వాహనదారులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, శిల్పారామం, ఐకియా జంక్షన్, ట్రెడెంట్ హోటల్, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ వైపు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
చుట్టు పక్కల జిల్లాల నుంచే..
రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ఈ రోజు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించాలనుకుని ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల కారణంగా అక్కడ సభ రద్దు చేసి హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నారు. ఈ సభకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. వర్చువల్ పద్ధతిలో అన్ని జిల్లాల్లో రైతు వేదికల నుంచి రైతులను నిధుల విడుదల కార్యక్రమం చూసేలా ఏర్పాట్లు చేశారు. మొదట రెండు ఎకరాలున్న రైతులకు నిధుల విడుదల చేయబోతున్నారు.

