Mobile Popup Ad
Mobile Popup Ad

మహేష్ బాబు AMB సినిమాస్‌కు షాక్: భారీ జరిమానా!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్, సినీ హీరో మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్‌ (AMB Cinemas)కు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (GSTAT) భారీ షాక్ ఇచ్చింది. సినిమా టికెట్లపై జీఎస్‌టీ తగ్గినా ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు బదిలీ చేయకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ.35 లక్షలు జమ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర వినియోగదారుల సంక్షేమ నిధులకు చెల్లించాలని స్పష్టం చేసింది.

కేవలం AMB సినిమాస్ మాత్రమే కాకుండా హైదరాబాద్‌లోని మరో ఆరు ప్రముఖ థియేటర్లపై కూడా ట్రిబ్యునల్ ఈ విధమైన చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ ఏడు థియేటర్లు అన్నీ కలిసి మొత్తం రూ.1.7 కోట్లను ప్రభుత్వ నిధులకు జమ చేయాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.

ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. 2019 జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సినిమా టికెట్లపై జీఎస్‌టీ రేట్లను ప్రభుత్వం తగ్గించింది. నిబంధనల ప్రకారం పన్ను తగ్గినప్పుడు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరలను తగ్గించి ఆ లాభాన్ని ప్రేక్షకులకు అందించాలి. కానీ AMB సినిమాస్‌ (AMB Cinemas)తో పాటు మిగిలిన థియేటర్లు ఆ పని చేయలేదు. జీఎస్‌టీ తగ్గిన తర్వాత టికెట్ ధరలు తగ్గించాల్సింది పోయి, వాటి బేస్ ధరను పెంచి పాత ధరలకే టికెట్లను విక్రయించారని ట్రిబ్యునల్ నిర్ధారించింది.

ఈ చర్యల ద్వారా సదరు థియేటర్ల యాజమాన్యాలు సీజీఎస్‌టీ (CGST) చట్టంలోని యాంటీ-ప్రాఫిటీరింగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు GSTAT ప్రకటించింది. ప్రేక్షకులకు చెందాల్సిన లాభాన్ని థియేటర్లు తమ జేబుల్లో వేసుకున్నాయని వ్యాఖ్యానించింది.

GSTAT ఆదేశాల ప్రకారం జరిమానా పడిన మిగిలిన థియేటర్ల వివరాలు చూస్తే.. విశ్వనాథ్ సినిమా హాల్ రూ.8.9 లక్షలు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ASR సినిమా LLP, G3 శ్రీనివాస సినిమాస్, ఏషియన్ శ్రీనివాస సినీప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ థియేటర్ తదితర యాజమాన్యాలు కూడా ఈ అక్రమ లాభార్జన నిరోధక చట్టం కింద నిధులు జమ చేయాలని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>