కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడిలో ఓ ప్రభుత్వ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మండల కేంద్రంలోనీ దొంతుకుంట చెరువు నుంచి తన పొలానికి మట్టిని తరలించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరిన ఒక రైతును రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎల్. శ్రీనివాస్ సోమవారం ఏసీబీ వలకు చిక్కారు.
బాధిత రైతు నుంచి ఏఈఈ శ్రీనివాస్ అశ్వారావుపేటలోని తన కార్యాలయంలో రూ. 2 లక్షల నగదును లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ దాడిని నిర్వహించింది. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఏఈఈ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ!

