కలం, వెబ్ డెస్క్ : నకిలీ ఫోన్ కాల్స్, మోసపూరిత ఇన్వెస్ట్‌మెంట్లు, డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్షా కా తిరంగా’ సైబర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడటంలో సామాన్యులే కాదు, ప్రముఖులు కూడా మినహాయింపు కాదని నాగార్జున స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తి బ్యాంకు అధికారిలా నటించి తనను కూడా బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడని, భారీగా పెట్టుబడులు పెట్టాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చాడని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా తన కుటుంబంలోని కొందరిని డిజిటల్ అరెస్టుల పేరుతో తీవ్ర భయాందోళనలకు గురిచేశారని పేర్కొన్నారు.
ఈ అనుభవాల తర్వాత డిజిటల్ భద్రత విషయంలో తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగత గోప్యత కోసం సెల్ ఫోన్ లో ఫొటోలు తీయడం కూడా పూర్తిగా తగ్గించేశానని, ప్రతి వారం క్రమం తప్పకుండా అన్ని ఖాతాల పాస్ వర్డ్ లను మారుస్తుంటానని వివరించారు.
సినిమా రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న పైరసీ సమస్యను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారని నాగార్జున కొనియాడారు. సీనియర్ పోలీస్ అధికారులు సీవీ ఆనంద్, సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం పైరసీని అడ్డుకోవడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు.

