కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోకాపేటకు చెందిన డెలివరీ బాయ్ అబ్దుల్ సమీద్ (31) అర్ధరాత్రి తన సహచరుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
ఉద్యోగం, ఆర్డర్ల డెలివరీల విషయంలో వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తోటి డెలివరీ బాయ్ సమీద్‌పై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సమీద్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘర్షణకు దారితీసిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.

