Mobile Popup Ad
Mobile Popup Ad

పెద్దపల్లి బైపాస్ సర్వేపై రైతుల ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చేపట్టిన సర్వే తీవ్ర వివాదానికి దారితీసింది. తమ పంట పొలాల మీదుగా బైపాస్ రోడ్డు నిర్మించేందుకు అధికారులు సర్వే నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దకల్వల గ్రామానికి చెందిన రైతులు సోమవారం రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు (Vijaya Ramana Rao) చొరవతో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరుకాగా, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కూడా నిర్వహించారు.

అయితే సోమవారం అధికారులు శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో కాకుండా మరో మార్గంలో సర్వే చేపట్టేందుకు వెళ్లడంతో రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పెద్దకల్వల రైతులు సర్వే బృందాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. మొదట ప్రతిపాదించిన మార్గంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అదే మార్గంలో బైపాస్ నిర్మిస్తే ప్రభుత్వానికి భూసేకరణ భారం కూడా తగ్గుతుందని రైతులు పేర్కొన్నారు.

తమ జీవనాధారమైన పంట పొలాలను బలవంతంగా తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. భూములు కోల్పోతే జీవనాధారం కోల్పోయినట్టేనని, తమ శవాల మీదుగానే రోడ్డు వేసుకోవాలంటూ రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిపాటి వ్యవసాయ భూములే తమ కుటుంబాలకు ఆధారమని, వాటిని కోల్పోతే జీవించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారుల తీరును నిరసిస్తూ రైతులు రాజీవ్ రహదారిపై పడుకుని ఆందోళన కొనసాగించారు. ఒక దశలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు తమ నిరసనను కొనసాగించారు. శంకుస్థాపన చేసిన పాత రూట్‌లోనే బైపాస్ రోడ్డు నిర్మించాలని, తమ పంట పొలాలను కాపాడాలని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>