Mobile Popup Ad
Mobile Popup Ad

పోలియో చుక్కలు ప్రతి చిన్నారికి అందాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో : ఐదేళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో చుక్కలు వేయించుకోని చిన్నారులను సోమ, మంగళవారాలలో ఇంటింటికి వెళ్లి గుర్తించి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఆదివారం కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ఓ ఇంటిని సందర్శించిన కలెక్టర్, అక్కడ ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారా లేదా అనే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో మాట్లాడి గ్రామంలో ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య, పోలియో చుక్కలు వేసుకున్న వారి శాతం తదితర వివరాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాల పిల్లలు అక్కడ పోలియో చుక్కలు వేయించుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించాలని సూచించారు. అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. చిగురుమామిడి మండలంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఎంతమంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందో, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఎలా సాగుతోందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్లు కూడా బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సూపర్‌వైజర్‌లు , బీఎల్‌వోలు సమన్వయంతో నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భవాని, ఏఎన్‌ఎం లక్ష్మి, గ్రామ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>