కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచాలని సోమవారం వనపర్తి (Wanaparthy) జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో దాదాపు 2 గంటలపాటు వాహనాలు నిలిపివేసి ముంపు బాధితులు (Buddaram Farmers) రాస్తారోకో నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న డబల్ బెడ్ రూం ఇళ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వాయర్ లో మునిగిపోయిన శిఖం భూములకు మొదటి విడతగా రైతులకు గతంలో 12 లక్షల 40 వేల రూపాయలు ఎకరాకు చెల్లించారని అన్నారు.
రెండవ విడతలో దాదాపు 110 ఎకరాల సారవంతమైన భూమి ముంపుకు గురవుతున్నదని తెలిపారు. ఈ భూముల్లో రెండు పంటలు పండేవని.. అందులో వ్యవసాయ బావులు, బోర్లు వ్యవసాయయోగ్యంగా ఉన్నాయని అన్నారు. ఇట్టి భూములకు కూడా ఎకరాకు 12 లక్షల 40 వేలు మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుందని.. దీన్ని రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
ఎకరాకు రూ.40 లక్షలు ఇవ్వాలి..
ఎకరాకు రూ.40 లక్షల నష్టపరిహారం చెల్లించాలని.. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, స్వయం ఉపాధి కోసం 10 లక్షల ఋణ సౌకర్యం అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారని సర్పంచ్ తెలిపారు. నిర్మించుకున్న డబల్ బెడ్ రూమ్ లకు బిల్లులు చెల్లించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో సొంతంగా 40 డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చిందని.. ఇళ్లను నిర్మించుకొని మూడేండ్లు అవుతున్నా నేటికి బిల్లులు చెల్లించడం లేదని, వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాజీ మంత్రి చిన్నారెడ్డి, గోపాల్ పేట తహసీల్దార్ హామీతో బాధితులు రాస్తారోకో విరమించారు. రైతులకు (Buddaram Farmers) చిన్నారెడ్డి, తహసీల్దార్ తో కలసి ముంపు రైతులకు పరిహారం పెంచేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతామని.. నిర్మించుకున్న 40 డబల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు వెంటనే బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ రాస్తారోకోలో సర్పంచ్ శేఖర్ గౌడ్, ఉప సర్పంచ్ శివాజీ, కావలి.కృష్ణయ్య, శేఖర్, నాగేంద్రం, లక్ష్మయ్య, పెద్ద వెంకటేష్ మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Read Also: లబ్ధిదారులకు అలర్ట్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’కు కొత్త రూల్స్
Follow Us On: Instagram

