Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల కోసం సహకార పెట్రోల్ బంక్ : ఎమ్మెల్యే విజయ రమణారావు

కలం, కరీంనగర్ బ్యూరో : సుల్తానాబాద్ (Sultanabad) మండలం నీరుకుల్ల గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కన్స్యూమర్ ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ & డీజిల్ పంప్)ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు (MLA Vijaya Ramana Rao) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 14 సంఘాలలో 11 సంఘాలను ఏకం చేసి ఎలిగేడు మండలం శివారులో 15 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సుల్తానాబాద్ సొసైటీ విత్తన శుద్ధి కేంద్రంగా ఎంపికైనట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో గోదాముల నిర్మాణం తక్కువగా జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణ పనులు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.

రాబోయే రెండు సంవత్సరాలలో నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, మహిళలకు ఆర్థికంగా మద్దతుగా పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నీరుకుల్ల గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మానేరు వాగు తాగునీరు రెండు నెలల్లో అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>