Mobile Popup Ad
Mobile Popup Ad

బిల్లులు రాలేదని స్కూల్‌కు తాళం వేసిన కాంట్రాక్టర్!

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) అర్బన్ మండల పరిధిలోని దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాల (Danavaigudem Govt School) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మన ఊరు – మన బడి” కార్యక్రమం కింద పాఠశాలలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ సి.అయోధ్య తనకు రావాల్సిన బిల్లులు సకాలంలో అందకపోవడంతో వినూత్న నిరసనకు దిగారు. పనులకు సంబంధించిన సుమారు రూ.11లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్‌తో స్కూల్ ప్రాంగణానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ​అనంతరం పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి కాంట్రాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు గేటుకు తాళం వేసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లే దారి లేకపోవడంతో వారంతా చాలా సేపు ఆరుబయటే ఎండలో నిలబడాల్సి వచ్చింది. చిన్న పిల్లల ఇబ్బందులను గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు ప్రత్యామ్నాయంగా విద్యార్థులను కాసేపు స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో కూర్చోబెట్టారు.

​ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖమ్మం అర్బన్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్ అయోధ్యతో మాట్లాడి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. పోలీసుల జోక్యంతో ఎట్టకేలకు శాంతించిన కాంట్రాక్టర్ పాఠశాల తాళాలు తెరిచారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుని తరగతి గదుల్లోకి వెళ్లారు. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా ప్రభుత్వ పాఠశాల మూతపడే పరిస్థితి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>