కలం, వెబ్ డెస్క్: పోలీస్ (Police) నోటిఫికేషన్లను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఉద్రిక్తతకు దారి తీసింది. నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, బోర్డ్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్రంగా ప్రతిఘటించారు. వెంటనే వారిని లాక్కెళ్లి, వ్యాన్లలో వేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
పోస్టులు పెంచాల్సిందే..
ఈ సందర్భంగా పోలీస్ నిరుద్యోగ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 20 వేల ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టులు వేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు 5 వేల పోస్టులు మాత్రమే వేస్తానని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. నోటిఫికేషన్ల కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నామని.. 5 వేల పోస్టులతో ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పోస్టుల సంఖ్యను వెంటనే 20 వేలకు పెంచి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం నివాసం, సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

