epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఈ ఏడాది ‘రాచకొండ’ సంచలన కేసులివే

కలం, వెబ్‌డెస్క్: ఈ ఏడాది హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధి (Rachakonda Crime Report)లో పలు సంచలన కేసులు వెలుగుచూశాయి. దర్యాప్తులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, ఆధారాలతో సహా నిందితులను అరెస్టు చేశారు. ఆ కేసుల్లో కొన్నింటి గురించి ‘రాచకొండ క్రైమ్ రిపోర్ట్-2025’ నివేదికలో పోలీసులు వెల్లడించారు. ఈ రిపోర్ట్‌ను సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు విడుదల చేశారు. ఆ వివరాలు ఇవీ..

కాల్చి బూడిద చేసి డ్రైనేజీలో కలిపాడు:

గురుమూర్తి, వెంకట మాధవి భార్యాభర్తలు. వీళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఒకరోజు ఇద్దరూ తగాదా పడుతుండగా.. మాధవి ఆవేశంలో భర్త చెంపపై కొట్టింది. కోపంతో రగిలిపోయిన గురుమూర్తి.. భార్యను కొట్టి చంపాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు. కొన్ని భాగాలను కాల్చి బూడిద చేశాడు. మరికొన్నింటిని డ్రైనేజీలో పడేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు (Rachakonda Crime Report )చేశాడు. దర్యాప్తులో పోలీసులకు గురుమూర్తి ప్రవర్తన, అతను చెపుతున్న విషయాలపై అనుమానం వచ్చింది. వెంటనే సీసీ కెమెరాలన్నీ జల్లెడ పట్టి భర్తే హంతకుడని తేల్చారు.

అనుమానంతో హతమార్చాడు:

బోడుప్పల్‌కు చెందిన మహేందర్ రెడ్డి, భార్య స్వాతి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ గొడవ పడేవాడు. అలాగే కట్నం తీసుకురమ్మంటూ వేధించేవాడు. ఒకరోజు గొడవలో భార్యను కిరాతకంగా హతమార్చాడు. రంపంతో మృతదేహం నుంచి తల, మొండెం, చేతులు, కాళ్లు వేరుచేశాడు. వాటిని మూసీలో పడేశాడు. పోలీసుల దర్యాప్తులో భర్తే హంతకుడని తేలడంతో అరెస్టు చేశారు.

కిడ్నీ ముఠా గుట్టురట్టు :

నగరంలో కొందరు డాక్టర్లు ముఠాగా ఏర్పడి భారీ స్థాయిలో కిడ్నీ రాకెట్ దందాకు పాల్పడ్డారు. ఒక్కో సర్జరీకి రూ.50 నుంచి 60లక్షల వరకు తీసుకుంటూ అక్రమంగా కిడ్నీలు అమర్చేవాళ్లు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డాక్టర అవినాశ్ ఈ రాకెట్‌లో కీలక నిందితుడు. దీనిపై సమాచారం అందడంతో ప్రధాన నిందితుడితోపాటు మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు.

చిన్నారుల అక్రమ రవాణా:

కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి చిన్నారులను అపహరించేవాళ్లు. ఆ పిల్లలను సంతానం లేనివాళ్లకు అమ్మేవాళ్లు. దీనికి గాను ఒక్కో చిన్నారికి రూ.4నుంచి రూ.5లక్షల చొప్పున వసూలు చేసేవాళ్లు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు వలవేసి ముఠాను పట్టుకున్నారు. 12మందిని అరెస్టు చేశారు. వాళ్ల చెరలో ఉన్న 16 మంది పిల్లలను విడిపించారు. ఇందులో 10 మంది ఆడపిల్లలు. ఆరుగురు బాలురు ఉన్నారు. వీళ్లలో కొందరిని సొంత తల్లిదండ్రులకు అప్పగించారు. మరికొందరిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

బాలుడిపై లైంగిక దాడి, హత్య:

నగరంలోని కేసీఆర్ నగర్‌లో ఈశ్వర్ పాండే దంపతులకు ఐదేళ్ల చిన్నారి ఉన్నాడు. ఒకరోజు హఠాత్తుగా ఆ పిల్లాడు కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడు ఖమర్(19) చిన్నారిని తీసుకెళ్లి, లైంగిక దాడి చేసి అనంతరం చంపేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. ఈ కేసులో నిందితుని గుర్తించడానికి పోలీసులు రోజుల తరబడి సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు.

విదేశీ మహిళపై అత్యాచారం:

ఓ విదేశీ మహిళ నగరంలోని స్నేహితుడు శరత్ ఇంటికి వచ్చింది. అనంతరం ఇద్దరూ సిటీ చూడ్డానికి బయలుదేరారు. వీళ్లకు సిటీ చూపిస్తామంటూ అబ్దుల్ సమద్, అతని స్నేహితులు కారులో ఎక్కించుకున్నారు. మామిడిపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లాక శరత్‌ను కొట్టి, విదేశీ మహిళపై అబ్దుల్ అత్యాచారం చేశాడు. తర్వాత నిందితునితోపాటు అతని స్నేహితులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఫోరెన్సి‌క్, మెడికల్, డిజిటల్ ఆధారాల సాయంతో నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో గూగుల్ పే ద్వారా చేసిన పేమెంట్ నిందితులను పట్టించింది.

Read Also: ‘కృష్ణా’ వాటాలో కేసీఆర్ మరణశాసనం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>