కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లోని ఉండవల్లిలో ఇటీవల వైసీపీ నాయకుల పర్యటన తీవ్ర ఉద్రిక్తత సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ శ్రేణులు, రైతులు వైసీపీ నేతలపై కోడిగుడ్లు, టమోటాలతో దాడులు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. అలాగే పలువురు వైసీపీ నేతల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
ఇక ఈ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే తాజాగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ (Devineni Avinash) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మళ్లీ అమరావతి పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. అమరావతి ప్రాంతంలో రేపు మళ్లీ వైసీపీ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పార్టీ అండగా ఉంటుందని అవినాష్ స్పష్టం చేశారు. తమను ఎంతమందితో అడ్డుకుంటారో చూస్తామన్నారు. పోలీసులు, టీడీపీ శ్రేణులు, రౌడీలు, గూండాలు ఎవరిని తీసుకొస్తారో రావాలంటూ సవాల్ విసిరారు.
వైసీపీ నాయకులపై దాడులు చేసి, తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం జంగిల్ రాజ్ విధానమేనని అవినాశ్ (Devineni Avinash) మండిపడ్డారు. టీడీపీ వాళ్లపై కేసులు పెడితే పోలీసులు ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కేసు కూడా తీసుకోవడం లేదన్నారు. మీడియా, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వైసీపీ నేతలపై దుష్ప్రచారం చేసినంత మాత్రాన ఎవరూ నమ్మే అవకాశం లేదన్నారు. కూటమి పాలకులు చేస్తున్న ప్రతి అవినీతిని ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు.

