Mobile Popup Ad
Mobile Popup Ad

అయోధ్య విరాళాల స్కామ్: నిందితుల అక్రమ ఆస్తులపై సిట్ సంచలన వెల్లడి

కలం, నేషనల్ డెస్క్: అయోధ్య విరాళాల స్కామ్ (Ayodhya Donation Scam) కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణలో నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ల ఆస్తిపాస్తులు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగినట్టు సిట్ గుర్తించింది. దొంగిలించిన విరాళాలతోనే ఆస్తులు కొనుగోలు చేసినట్టు అనుమానిస్తున్నది.

8 మంది నిందితుల్లో ఆరుగురు ఎస్‌బీఐ నియమించిన ప్రైవేట్ అవుట్‌సోర్సింగ్ క్యాష్ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా విరాళాల లెక్కింపు టీమ్‌లో చేరారు. వీరిలో అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, అవినాశ్ శుక్లా ఉన్నారు. మరో ఇద్దరిలో సుభాశ్ శ్రీవాస్తవ ఎస్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగి. ట్రస్టు తరఫున విరాళాల లెక్కింపు ప్రక్రియ మొత్తానికి సూపర్‌‌వైజర్‌‌గా వ్యవహరించాడు. రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌ డ్రైవర్.

అతడే సూత్రధారి..

కుంభకోణంలో అనుకల్ప్ మిశ్రాను సూత్రధారిగా సిట్ అనుమానిస్తున్నది. మూడేండ్ల కింద ఆలయ ట్రస్టులో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన అతడు.. ఆ తర్వాత తన బావమరిది లవకుశ్‌ను కూడా ఆ టీమ్‌లోకి తీసుకున్నాడు. దర్యాప్తులో భాగంగా సిట్‌.. అనుకల్ప్ స్వగ్రామం అయోధ్య జిల్లాలోని ‘బసావా’ను సందర్శించింది. అక్కడ చుట్టుపక్కల వాళ్లతో పోలిస్తే అనుకల్ప్ ఇల్లు విలాసవంతంగా, భారీ ఖర్చుతో నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. ఒకట్రెండు సంవత్సరాల్లోనే అనుకల్ప్ కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఊహించని విధంగా మారిపోయాయని పోలీసులకు స్థానికులు వెల్లడించారు.

గతేడాది అయోధ్య నగరంలో అనుకల్ప్ సుమారు రూ.65 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. గ్రామ శివారులో ఒక ఫామ్‌హౌస్ కూడా నిర్మించాడు. అలాగే కొత్త మహీంద్రా స్కార్పియో కారును కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏప్రిల్ 30న అనుకల్ప్ తన గ్రామంలో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఒక ధార్మిక కార్యక్రమం నిర్వహించాడు. ఈ వేడుకకు ట్రస్ట్‌ నాటి జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్ సహా కొందరు ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీగా ఖర్చు చేశాడని, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుకల్ప్ బావమరిది లవకుశ్ మిశ్రా ఆర్థిక స్థితిపైనా పోలీసులు నిఘా పెట్టారు. అద్దె ఇంట్లో ఉంటున్న అతడు.. ఇటీవల రూ. లక్షకు పైగా విలువైన కొత్త బైక్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

100 రెట్లు పెరిగిన ఆస్తులు

అనుకల్ప్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు బయటపడడంతో మిగతా నిందితుల ఆస్తిపాస్తులపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్ల బ్యాంక్ ఖాతాలు, ఆస్తి పత్రాలు, పెట్టుబడులు, ఖర్చుల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధాన నిందితుడు అనుకల్ప్ మిశ్రాతో పాటు మరికొందరు నిందితుల నికర ఆస్తి విలువ గత కొద్దికాలంలోనే ఏకంగా 100 రెట్లకు పైగా పెరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. చాలా సాధారణ వేతనాలతో ఉద్యోగాల్లో చేరిన ఈ నిందితులు.. భక్తులు సమర్పించిన కానుకలను దారిమళ్లించి అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టారని సిట్ నిర్ధారించింది. మరోవైపు ఈ కుంభకోణం కేవలం అరెస్ట్ అయిన 8 మందికే పరిమితం కాలేదని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 30 మందిపై నిఘా పెట్టారు. నిందితుల కుటుంబ సభ్యులను, బంధువులను కూడా ప్రశ్నిస్తున్నారు. గత నాలుగేళ్ల కాలంలో నిందితులు కొనుగోలు చేసిన స్థిరాస్తులు, ఖరీదైన వాహనాల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఆధారాలు ధ్వంసం..

విరాళాల దొంగతనం విషయం బయటకురాగానే నిందితులు దొరికిపోతామనే భయంతో డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు విచారణలో తేలింది. ఈ భారీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా చూసేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు పట్టుకునే సరికే వారు తమ మొబైల్ ఫోన్లలోని కీలక డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు దొరకకుండా ఫోన్‌లను ఫార్మాట్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్‌లలోని డేటాను రికవరీ చేసేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

రూ.80 లక్షలు స్వాధీనం..

పోలీసులు తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారనే విషయం ముందే తెలియడంతో కొందరు నిందితులు తాము అక్రమంగా సంపాదించిన నగదు, బంగారాన్ని వేరేచోటుకు తరలించడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ సొమ్మును వేరే ప్రదేశాలకు తరలించడం, బంధువుల ఇళ్లలో దాచడం లాంటివి చేశారని సమాచారం. అయినప్పటికీ పోలీసులు నిందితుల ఇళ్ల నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>