Mobile Popup Ad
Mobile Popup Ad

సిగాచి ఘటనకు ఏడాది.. అందని రూ.కోటి పరిహారం!

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలో సిగాచి (Sigachi) పరిశ్రమలో గతేడాది జూన్ 30న జరిగిన ఘోర పేలుడు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై నిర్లక్ష్యం చేస్తే.. ఎలాంటి విపత్తు సంభవిస్తుందో అది చాటిచెప్పింది. సిగాచి ప్రమాదానికి ఏడాది అయిన సందర్భంగా భద్రతా లోపాలు, బాధితులకు న్యాయం, అధికారుల బాధ్యత వంటి అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. పరిశ్రమల భద్రతను గాలికి వదిలేస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో చెప్పడానికి సిగాచి పరిశ్రమలో ప్రమాదమే నిదర్శనం. లాభాల కోసం యాజమాన్యం ప్రదర్శించిన నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం వెరసి అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది.

నాడు భారీ పేలుడు.. 54 మంది బలి

పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించగా.. మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. మంటలు, దట్టమైన పొగ మధ్య చిక్కుకున్న కార్మికులు బయటపడలేకపోయారు. శిథిలాల కింద, ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినా, ప్రమాద తీవ్రత కారణంగా పలువురి మృతదేహాలను గుర్తించడం కూడా కష్టమైంది. 8 మందికి సంబంధించిన అన‌వాళ్ల కుడా దొర‌క‌ని స్థాయిలో భారీ ప్రమాదం జ‌రిగింది. ప్రమాదంలో చనిపోయినవారు బిహార్, ఒడిశా, యూపీ, ఏపీలకు చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు.

రూ. కోటి పరిహారం ఉత్తమాటేనా..?

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, సిగాచి యాజమాన్యం ప్రకటించాయి. ఇప్పటివరకు ఆ హామీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బాధిత కుటుంబాలు, కార్మిక సంఘాలు అంటున్నాయి. 54 కుటుంబాలకు కలిపి రూ.24.51 కోట్లే చెల్లించగా, ఒక్కో కుటుంబానికి సగటున రూ.45 లక్షల వరకు మాత్రమే అందాయని చెప్తున్నాయి. కంపెనీ చెల్లించిన పరిహారంలో పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి చట్టబద్ధ ప్రయోజనాలను కూడా కలిపి చూపించారని, గాయపడిన కార్మికుల వైద్య ఖర్చులనూ పూర్తిగా కంపెనీ భరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి కోల్పోయిన కార్మికులు..

ప్లాంటులో మూడు షిఫ్టులు కలిపి మొత్తం 250 నుంచి 300 వరకు కార్మికులు, మేనేజ్‌మెంట్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండేవారు. లేబ‌ర్ కాంట్రాక్టర్ ద్వారా రోజువారి ప‌నికి కార్మికులు వ‌స్తుండేవారు. ప్రమాదం అనంతరం సిగాచి పరిశ్రమ మూతపడింది. వందలాది మంది శాశ్వత, కాంట్రాక్ట్, రోజువారీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రస్తుతం పరిశ్రమకు సంబంధించిన వివిధ కేసులు కోర్టులు ఉన్నాయి.

భద్రతపై మరోసారి చర్చ..

సిగాచి ప్రమాదం తర్వాత పరిశ్రమల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం, భద్రతా ప్రమాణాల అమలులో వైఫల్యం చివరకు అమాయక కార్మికుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా పరిశ్రమల్లో భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సిగాచి ఘటన మరోసారి గుర్తు చేసింది.

కంపెనీలో లోపాలపై కమిటీల రిపోర్ట్..

  • సిగాచి ప్రమాదంపై విచారణ జరిపిన హైపవర్, నిపుణుల కమిటీలు పరిశ్రమలో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. సామర్థ్యానికి మించి యంత్రాలు ఏర్పాటు చేయడం, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం, డస్ట్ కంట్రోల్ వ్యవస్థ సరిగా లేకపోవడం వంటి అంశాలను గుర్తించాయి. ఈ లోపాలను పర్యవేక్షించాల్సిన సంబంధిత ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యమూ ప్రమాదానికి కారణమైందని నివేదికలు స్పష్టం చేశాయి.
  • ప‌రిశ్రమ‌లో 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1,777 హెచ్‌పీకి యంత్రాలను పెంచేశారని, వంద‌లాది మంది కార్మికులు ప‌నిచేసే చోట క‌నీస భ‌ద్రతా ప్రమాణాలను పాటించ‌లేద‌ని నివేదకలో కమిటీలు పేర్కొన్నాయి. సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదు.
  • ప‌ర్యవేక్షించాల్సిన వివిధ ప్రభుత్వ శాఖ‌ల అధికారులు నిర్లక్ష్యం వ‌హించడంతో ప్రమాదం జ‌రిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపాయి. క‌నీసం బ‌దిలీలు కూడా చేయకపోవడం గమనార్హం. ప్రమాదం జరిగి ఏడాది పూర్తవుతున్నా, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లోపాలేవీ లేవని కంపెనీ వాదనలు..

ఘటనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. గతంలో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి భద్రతా అనుమతులు, ఎన్‌ఓసీలు పొందామని, తమ పరిశ్రమలో లోపాలేవీ లేవని సంబంధిత శాఖలే ధ్రువీకరించాయని సిగాచి యాజమాన్యం వాదిస్తున్నది. కంపెనీకి చెందిన పలువురిపై కేసులు నమోదుకాగా, సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్టైన అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

పరిహారం త్వరగా ఇవ్వాలి: వై.అశోక్ కుమార్, టీపీజేఏసీ చైర్మన్, సంగారెడ్డి జిల్లా

మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, సిగాచీ యాజమాన్యం ప్రకటించాయి. కేవలం రూ. 45 లక్షల చొప్పున సుమారు 24.5 కోట్లు మాత్రమే చెల్లించి, మిగిలిన రూ.55 లక్షల చొప్పున 29.5 కోట్లను ప్రభుత్వం చెల్లించాలని కంపెనీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో 54 కుటుంబాలకు ఇంకా రూ.29.5 కోట్లకు పైగా పెండింగ్ పరిహారం అందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మిగిలిన పరిహారం చెల్లించాలి. విచారణ కమిటీ నివేదికను, పారిశ్రామిక తనిఖీల ఫలితాలను విడుదల చేయాలి. హైకోర్టులో పెండింగ్‌లోని పిల్‌ను అత్యవసరంగా విచారించాలి. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ, క్లెయిమ్‌లను కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించేలా చూడాలి. ప్రమాదం పాత యంత్రాల వాడకం, భద్రతా లోపాల వల్ల జరిగిందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు వేగంగా సాగాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>