Mobile Popup Ad
Mobile Popup Ad

ఫోన్ కాల్ .. పంట కొనుగోలు

కలం, ఆదిలాబాద్ బ్యూరో: రైతులు పండించిన పంటను దళారులకు అమ్మరు. సిండికేట్ మాఫియా దోపిడీకి గురికారు. మార్కెట్ యార్డుల చుట్టూ రోజులు తిరగరు. రైతులే సంఘంగా ఏర్పడి తమ పంటను తామే కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలకు అమ్ముతున్నారు. మెరుగైన ధరలు పొందడమే కాకుండా, వచ్చిన లాభాలను సమానంగా పంచుకుంటున్నారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రజామిత్ర’ ఆదివాసీ రైతుల సహకార సంఘం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుంది.

ఇబ్బందులు పడలేక..

జిల్లాలో (Adilabad) గిరిజన రైతులు ప్రధానంగా పత్తి, సోయాబిన్, మొక్కజొన్న, జొన్న, కందులు, శనగ వంటి పంటలను సాగు చేస్తుంటారు. గతంలో పంటలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళ్తే వ్యాపారులు ధరల్లో కోత విధించడం, తూకాల్లో మోసం చేయడం, చెల్లింపులు ఆలస్యం చేయడం వంటి సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. శ్రమ రైతులదైనా, లాభాలు మాత్రం దళారులకే దక్కేవి.

కనీస మద్దతు ధర..

వ్యాపారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన ఆదివాసీ రైతులు 2004లో ‘ప్రజామిత్ర’ (Prajamitra) పేరుతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 43 మంది రైతులతో మొదలైన సంఘంలో ప్రస్తుతం సుమారు 8 వేల మంది సభ్యులున్నారు. సంఘంలో సభ్యులైన రైతులు తమ పంటలను ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా ఉట్నూర్ మండలం నాగాపూర్‌లోని సంఘం కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తారు. సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పత్తి, సోయాబిన్, మొక్కజొన్న, జొన్న, కందులు, శనగ తదితర పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు.

ప్రభుత్వ సంస్థలకు అమ్మకాలు..

సంఘం కొనుగోలు చేసిన పంటలను మార్క్‌ఫెడ్, నాఫెడ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలకు అమ్ముతున్నారు. దీంతో రైతులు మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా నేరుగా మద్దతు ధర పొందుతున్నారు.

వాట్సాప్‌‌లో సమాచారం..

పంట కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎంత. పంటను ఎప్పుడు తీసుకురావాలి వంటి వివరాలను సంఘం వాట్సాప్ గ్రూపులు, ఫోన్ కాల్స్ ద్వారా రైతులకు అందిస్తుంది. దీంతో రైతులు మార్కెట్ యార్డుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సరైన సమయంలో తమ పంటను తీసుకొచ్చి అమ్ముతున్నారు.

లాభాల్లోనూ‌‌ సభ్యులకు వాటా..

పంట కొనుగోళ్ల ద్వారా సంఘానికి సెస్ రూపంలో ఆదాయం వస్తుంది. దాన్ని సభ్యులైన రైతులకు సమానంగా పంచడంతో పాటు, విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ ఇన్‌పుట్స్ ను కూడా సంఘమే అందిస్తుంది. దీంతో రైతులు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని సభ్యులు చెబుతున్నారు.

రాష్ట్రానికి ఆదర్శంగా సంఘం..

రైతుల ఐక్యతతో ఏర్పడిన ప్రజామిత్ర సంఘం దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే కాకుండా, గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. రైతులే తమ పంటకు యజమానులుగా నిలిచి, మార్కెటింగ్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుంది.

Read Also:  మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నారా.. ఇవే కీలకం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>