కలం, తెలంగాణ బ్యూరో : పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలను తెలంగాణలో అమలు చేస్తామనే సంకేతాలు ఇస్తే ఇక్కడి ప్రజలు సహించరని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) హెచ్చరించారు. తెలంగాణలో ప్రజల తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తున్నదని, విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వక్రీకరిస్తున్న బీజేపీ తెలంగాణ ప్రజల మనసును ఎలా గెల్చుకుంటుందని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి, రాజకీయంగా నష్టాలు ఎదురవుతాయని తెలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌పై తమకు గౌరవం ఉందని, అంతమాత్రాన చారిత్రక వాస్తవాలను మార్చలేరని అన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా, అనుమతులు మంజూరు చేయకుండా వివక్ష చూపిస్తున్న బీజేపీ ఇక్కడ ఎలా గెలుస్తుందన్నారు.
బీజేపీ నేషనల్ చీఫ్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ :
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్‌లో పాల్గొన్న పార్టీ సమావేశం ఓ అట్టర్ ఫ్లాప్ షో అని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. చిన్న సమావేశాన్ని సైతం నిర్వహించలేని పరిస్థితిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలస్తుందన్నారు. బూత్ స్థాయి నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు విజయాలు సాధిస్తామని చెప్పే ముందు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విభజన రాజకీయాలను తిరస్కరించారని గుర్తు చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసే ముందు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు. నగరాల పేర్లు మార్చడంపై ఉన్న ఆసక్తిలో కొంతైనా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై చూపాలన్నారు. మతపరమైన రాజకీయాల కోసమే పేర్ల మార్పు అంశాన్ని ముందుకు తెస్తున్నదని, నగరాభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణే లేదన్నారు.
బీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తు జరిపే దమ్ముందా? :
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు బీజేపీ సిద్ధమేనా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారని, సీబీఐ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో నితిన్ నబీన్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వారసత్వ రాజకీయాలపై ఇతర పార్టీలను విమర్శించే బీజేపీ, ఎన్నికల అవసరాల కోసం అదే కుటుంబాలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఏ విధమైన రాజకీయమో చెప్పాలని నిలదీశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ఆర్థిక సమస్యలు, తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సమాధానం చెప్పకుండా జాతీయవాదం పేరుతో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

