Mobile Popup Ad
Mobile Popup Ad

పేపర్ బండి నుంచి జాతీయ రికార్డు వరకు.. అఫ్సల్ గోల్డెన్ రన్!

కలం, స్పోర్ట్స్ : ఉదయం మూడు గంటలు. ఊరు ఇంకా నిద్రలోనే ఉంటుంది. కానీ ఓ కుర్రాడు మాత్రం పేపర్ ట్రక్ కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నాడు. 22 కిలోమీటర్లు ప్రయాణించి మైదానానికి చేరుకుని అక్కడ ప్రాక్టీస్ చేశాడు. ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసిన ఆ బాలుడే ఇప్పుడు భారత అథ్లెటిక్స్‌లో కొత్త చరిత్ర రాశాడు. 800 మీటర్లలో జాతీయ రికార్డు బద్దలు కొట్టి.. దేశంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్‌గా నిలిచాడు. అతడే మహ్మద్ అఫ్సల్ (Mohammed Afsal).

ఫుట్‌బాల్ నుంచి ట్రాక్ వరకు

కేరళలోని పాలక్కడ్‌కు చెందిన అఫ్సల్‌ (Mohammed Afsal)కు చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ప్రతిరోజూ తండ్రితో కలిసి మైదానానికి వెళ్లి పెద్దవాళ్లతో ఆడేవాడు. అయితే ఒక మ్యాచ్‌లో తండ్రికి కాలు విరగడంతో.. తన కుమారుడికి కూడా గాయం అవుతుందేమోనని భావించాడు. దీంతో ఫుట్‌బాల్‌కు దూరమయ్యాడు. అదే సమయంలో మైదానంలో పరుగులు తీసే ఓ వ్యక్తిని చూసి రన్నింగ్ ప్రారంభించాడు. అయినా తొలి రెండేళ్లు అథ్లెటిక్స్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఒక ఓటమి.. జీవితానికే మలుపు

2010లో జరిగిన 600 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత అఫ్సల్ ఆలోచన మారింది. కష్టపడకపోతే విజయం సాధ్యం కాదని గుర్తించాడు. తర్వాతి ఏడాది రాష్ట్ర స్థాయి 3000 మీటర్ల పోటీల్లో స్వర్ణం గెలిచి మీట్ రికార్డు సృష్టించాడు. అదే ఏడాది యూత్ నేషనల్స్‌లో 1500 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు.

పేపర్ బండి.. ప్రాక్టీస్.. అదే దినచర్య

అఫ్సల్ ఇంటి నుంచి శిక్షణ మైదానం 22 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఉదయం 5.30 గంటలకు ప్రాక్టీస్ మొదలయ్యేది. కానీ తొలి బస్సు 6.30కే ఉండేది. దీంతో పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ఉదయం 3 గంటలకు లేచి పేపర్ పంపిణీ వాహనాల్లో లిఫ్ట్ తీసుకుని మైదానానికి వెళ్లేవాడు. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. ఆ కష్టమే అతడిని ఒక్కో మెట్టుగా పైకి తీసుకెళ్లింది.

విజయాల బాటలో అఫ్సల్

ఆసియా స్కూల్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాడు. స్కూల్ నేషనల్స్‌లో వరుస పతకాలు గెలిచాడు. 2013లో ఓ పోటీలో విజేతగా నిలిచి టాటా నానో కారును సొంతం చేసుకున్నాడు. 2015లో తొలి సీనియర్ పోటీలోనే కాంస్యం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. పలు ఉద్యోగ అవకాశాలు వచ్చినా.. భారత వైమానిక దళంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నాడు.

2018లో వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసినా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. కరోనా ప్రభావం, చీలమండ గాయం అతడి కెరీర్‌ను వెనక్కి నెట్టాయి. జాతీయ శిబిరంలో చోటు కూడా కోల్పోయాడు. ఒక దశలో అథ్లెటిక్స్‌కు వీడ్కోలు చెప్పాలనుకున్నాడు. అయితే 2021లో రిలయన్స్ ఫౌండేషన్ ఎండ్యూరెన్స్ జట్టులో చేరడం అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.

రికార్డుతో చరిత్ర

కొత్త శిక్షణతో అఫ్సల్ మరింత బలంగా మారాడు. 2022లో వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ నమోదు చేశాడు. 2023 ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచాడు. 2024లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. 2025లో 1:44.93 టైమింగ్‌తో భారత పురుషుల 800 మీటర్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి.. దేశంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. అఫ్సల్ ఇంకా వేగంగా పరుగెత్తగలననే నమ్మకంతో ఉన్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ అర్హత మార్క్‌ను అందుకోవడం, వచ్చే ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపాడు. విమర్శలను పట్టించుకోకుండా శిక్షణ, విశ్రాంతిపై దృష్టి పెడితే విజయం తప్పకుండా వస్తుందని యువ అథ్లెట్లకు సూచించాడు. అలాగే జూనియర్ స్థాయిలో డోపింగ్ సమస్యపై కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. కష్టపడి సాధించిన విజయాలకే అసలైన విలువ ఉంటుందని పేర్కొన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>