కలం, వరంగల్ : వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వరంగల్ (Warangal) జిల్లా చలపర్తి గ్రామంలోని (Chalaparthi Village) ప్రజలు వరుణ దేవునికి ప్రత్యేక పూజలు (Rain Prayers) నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోటగిరి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలోని కప్పతల్లి వద్ద మొదలైన పూజలు బొడ్రాయి వరకు కొనసాగాయి. అనంతరం హనుమాన్ టెంపుల్ వరకు గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి వరుణ దేవుని కృప కోసం ప్రార్థనలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్థులు సామూహికంగా ఈ పూజలలో పాల్గొన్నారు. గ్రామంలో శాంతి, సుభిక్షత కలగాలని కోరుతూ ప్రత్యేక ఆచారాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

