కలం, వెబ్ డెస్క్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాస్ తనూరా ప్రాంతంలో సౌదీ ఆరామ్ కో చమురు కంపెనీకి చెందిన హెలికాప్టర్ కూలి (Helicopter Crash) 14 మంది మరణించారు. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేకపోయారని ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. మరణించినవారు సౌదీ పౌరులేనని.. విదేశీయులు ఎవరూ లేరని స్పష్టం చేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో.. అని సాంకేతిక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.
ప్రమాద కారణంపై ముమ్మర విచారణ..
హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి తమకు ఎలాంటి కుట్ర కోణం కనిపించడం లేదని సంబంధిత వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయి. అయితే పూర్తి నివేదిక వస్తే గానీ స్పష్టత రాదని చెప్పాయి. వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులా.. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా.. అనే అంశంపై విచారణ జరుగుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ మరోసారి క్షిపణులు ప్రయోగించిన వేళ హెలికాప్టర్ కూలిపోయిన ఉదంతంతో సౌదీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

