కలం, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సవాల్ విసిరారు. ఆదివారం సిద్ధిపేటలో పర్యటించిన హరీశ్ రావు సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ గుంపు మేస్త్రీ కాదు.. ముంపు మేస్త్రీ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎగ్గొట్టిందో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గెలుస్తామని నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని హరీశ్ సవాల్ విసిరారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. బీఆర్ఎస్ హయాంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని గుర్తు చేశారు.
రైతుబంధు ఎగ్గొట్టినందుకు, రైతు బీమా ఆపేసినందుకు రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే సీఎం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీని ప్రక్షాళన చేస్తానంటున్న రేవంత్ రెడ్డి.. ఆ నదిలో ప్రవహించే నీళ్లు మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయని గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిద్రలోనూ కేసీఆర్ పేరే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

