Mobile Popup Ad
Mobile Popup Ad

యూరియా సరఫరాలో ప్రభుత్వాల వైఫల్యం: సుంకే రవిశంకర్

కలం, కరీంనగర్ బ్యూరో: యూరియా కొరతను నిరసిస్తూ సంబంధిత యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో రోడ్డు చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. రోడ్డుపై గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ (Sunke Ravi Shankar)తో పాటు బీఆర్ఎస్ శ్రేణులను బలవంతంగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో సుంకే రవి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రైతులకు యూరియా అందని పరిస్థితి..

రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో రైతులకు ఒక్క బస్తా కూడా అందని పరిస్థితి నెలకొందని సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వద్ద కేవలం 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉందని, ఇది రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోరగా.. కేంద్రం కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసిందన్నారు. ఏప్రిల్, మే నెలల్లో కోటా ప్రకారం 2 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, కేవలం లక్షా యాభై వేల మెట్రిక్ టన్నులే రాష్ట్రానికి చేరాయని చెప్పారు.

జూలై, ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే సమయంలో రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారని విమర్శించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తయ్యే యూరియాలో కనీసం 90 శాతం రాష్ట్ర రైతులకు కేటాయించాలని తాము పదేపదే డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు కూడా నోరు మెదపడం లేదని విమర్శించారు.

యాప్ తో రైతులకు కొత్త కష్టాలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ రైతులకు ఉపశమనం కాకుండా కొత్త కష్టాలను తెచ్చిందని . ఒక్కో జిల్లాకు ఒక్కో సమయంలో మాత్రమే యాప్ యాక్సెస్ ఇస్తూ యూరియా కొరతను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. యాప్ తెరిచిన వెంటనే “నో స్టాక్” అని చూపిస్తోందని, ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాకే పరిమితం చేయడం ప్రభుత్వ వద్ద నిల్వలు లేవనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఎక్కువ ఎకరాలు సాగు చేసే రైతులు పదేపదే దరఖాస్తులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. మరోవైపు ప్రభుత్వ సొసైటీల్లో యూరియా లేకపోయినా ప్రైవేట్ డీలర్ల వద్ద మాత్రం నిల్వలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.

బ్లాక్ మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.400..

రూ.266 సబ్సిడీ ధరకు అందాల్సిన యూరియా బస్తా బ్లాక్ మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారని, యూరియాతో పాటు ఇతర ఎరువులు, లిక్విడ్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే బస్తా ఇస్తామని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని రవిశంకర్ ఫైర్ అయ్యారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో సహకార సంఘాల కొత్త పాలక మండళ్ల ఏర్పాటులో నెలకొన్న అయోమయం కూడా యూరియా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందన్నారు.

ప్రభుత్వం విఫలమైంది..

కోర్టు ఆదేశాల నేపథ్యంలో పాత పాలక మండళ్లు కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్‌పై స్పష్టత లేక సీఈఓలు కొత్త ఇండెంట్లు పెట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. మార్క్‌ఫెడ్ గోదాముల్లో ఉన్న యూరియాను జిల్లాలకు, సొసైటీలకు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని, బ్లాక్ మార్కెట్‌కు చేరడంలో మాత్రం విజయవంతమైందని విమర్శించారు. నాట్లు వేసే సమయంలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఏదీ రైతుకు అందడం లేదు..

రైతు భరోసా, రైతు బీమా, సాగునీరు, నాణ్యమైన విద్యుత్, ఎరువులు ఏదీ రైతుకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొనుగోలు యాప్‌ను వెంటనే రద్దు చేసి పాత విధానంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేసిన సుంకే రవిశంకర్, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడితో పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు పక్షాన బీఆర్ఎస్ చివరి వరకు పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>