కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేటలో కొంత మంది రాజకీయ నాయకులు అక్రమంగా ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. బీఎల్ఏ, బీఎల్వో ఆఫీసర్లను కూర్చోపెట్టుకుని ఇలా చేస్తున్నట్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. బీఎల్వోలను ఇంట్లో కూర్చోపెట్టుకొని ఓటు మ్యాపింగ్ చేసినట్లయితే, ఆ ఓట్లు తొలగిపోతాయని హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం బక్రీచెప్యాల గ్రామంలో మీడియాతో మాట్లాడారు.
వారికి ప్రజలు సహకరించొద్దు..
ప్రైవేట్ వ్యక్తులు చేసే ఇలాంటి మ్యాపింగ్‌కు ప్రజలు సహకరించవద్దని ఎంపీ రఘునందన్ రావు కోరారు. గ్రామాల్లో ఈ రోజు వరకు 35 శాతం మ్యాపింగ్ జరిగితే, పట్టణాల్లో కేవలం 12 నుంచి 15 శాతం వరకే జరిగిందని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీల నేతలు బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టుకుని ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
క్రిమినల్ కేసులు పెడుతారు..
సర్ ప్రక్రియ సరైంది కానప్పుడు, ఆయా పార్టీల నేతలు ఎందుకు ఏజెంట్లను పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియ ద్వారా ముస్లింల ఓట్లు, బీజేపీ నచ్చని వారి ఓట్లు పోతాయని కొందరు మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. SIR ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు.

