Mobile Popup Ad
Mobile Popup Ad

అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

కలం, తెలంగాణ బ్యూరో : అరుదైన వృక్ష జాతులకు, వన్య ప్రాణులకు అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందిన అమ్రాబాద్ అడవులు మరో రికార్డును సొంతం చేసుకున్నది. దేశంలోనే అతి పెద్ద సీతాకోకచిలుక పస్ట్ టైమ్ కనిపించింది. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఇది అరుదుగా ఉంటుందని పేర్కొన్న అటవీ అధికారులు దీనిని ‘సదరన్ బర్డ్ వింగ్’ బటర్‌ఫ్లై (Southern Birdwing Butterfly) అని పేర్కొన్నారు.

మొదటిసారిగా ఇది కనిపించిందని పేర్కొన్న ఫారెస్ట్ ఆఫీసర్లు నీలేశ్, జీవ శాస్త్రవేత్త డాక్టర్ రవికాంత్.. ఇది తెలంగాణలోని జీవ వైవిధ్య పరిరక్షణకు, శాస్త్రీయ పరిశోధనలకు కీలకమైన ఘట్టమని వ్యాఖ్యానించారు. ఎక్కువగా పశ్చిమ కనుమల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన సీతాకోక చిలుక చాలా కొన్ని సందర్భాల్లోనే తూర్పు కనుమల్లో కనిపిస్తుందని, ఆమ్రాబాద్ అడవుల్లో మాత్రం మొదటిసారి కెమెరాకు చిక్కిందన్నారు.

ఈ సీతాకోకచిలుక రెక్కలు వెడల్పు సుమారు 140 మిల్లీమీటర్లు (14 సెంటీమీటర్లు), పొడవు 190 మిల్లీమీటర్ల (19 సెంటీమీటర్ల) వరకు ఉందని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు. ఈ కారణంగానే భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోకచిలుకలలో ఒకటిగా దీనికి గుర్తింపు ఉందన్నారు. వెరైటీ సీతాకోకచిలుక కనిపించడం అమ్రాబాద్ అడవుల పర్యావరణ ప్రాముఖ్యతను మరోసారి చాటనట్లయిందని తెలిపారు.

దక్షిణ భారతదేశానికి మాత్రమే చెందిన పెద్ద స్వాలో టెయిల్ జాతి సీతాకోకచిలుక (Southern Birdwing Butterfly) ఎక్కువగా పశ్చిమ కనుమల్లోని అడవుల్లో మాత్రమే ఉంటుందని, ఇప్పుడు ఆమ్రాబాద్ అడవులకు విస్తరించడంపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉన్నదని ఫారెస్ట్ అధికారులు అభిప్రాయపడ్డారు. మగ సీతాకోకచిలుకకు నలుపు రంగు రెక్కలపై ఆకుపచ్చ, నీలం రంగు మెరుపులు కనిపిస్తాయని.. ఆడ సీతాకోకచిలుక రెక్కలపై క్రీమ్ లేదా పసుపు రంగు మచ్చలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని వివరించారు.

ఈ వెరైటీ సీతాకోకచిలుకలు దట్టమైన అడవులు, చెట్లతో నిండిన ప్రాంతాలు, లార్వా పెరిగే ఆతిథ్య మొక్కలు ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తుందన్నారు. ఇలాంటి పెద్ద సీతాకోకచిలుకలు పూలలోని తేనెను ఆహారంగా తీసుకుంటాయి. కానీ దానికి ముందటి దశలోని గొంగళిపురుగుల రూపంలో అరిస్టోలోచియా ఇండికా వంటి జాతి మొక్కల ఆకులపై ఆధారపడతాయి. ఈ జాతి మొక్కలు, సహజ అటవీ ప్రాంతాలు తగ్గిపోతే ఈ సీతాకోకచిలుక మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు (Amrabad Tiger Reserve) ఫారెస్టులో ఇది కనిపించడం తెలంగాణ జీవవైవిధ్య పరిరక్షణలో ఒక కీలక మైలురాయి అని భావిస్తున్నారు.

Read Also: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సఫారీ బంద్.. కారణం ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>