కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే ద్విసూత్రాన్ని అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. ఆదివారం నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా పట్టణంలో పర్యటించిన మంత్రి రూ.30.32 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్మించిన 440 డబుల్ బెడ్‌రూమ్ గృహాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి తాళాలు, గృహ పట్టాలను పంపిణీ చేశారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అమృత్ పథకం కింద రూ.28.18 కోట్లతో చేపట్టనున్న భైంసా పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునికీకరణ, కొత్త పైప్ లైన్ల నిర్మాణం తదితర పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ. 2.14 కోట్లతో మహదేవ్‌పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే భైంసా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు పెరిగి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం గృహ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లడుతూ.. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భైంసా అభివృద్ధికి నిధుల కొరత లేదని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అవినీతికి తావులేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. భైంసా పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత పట్టణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి భైంసాను అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ దత్తాత్రి, వైస్ చైర్‌పర్సన్ కుతిజ సిద్ధిక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

