కలం, వెబ్ డెస్క్: ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో (Hyderabad) 6 రోజుల వర్క్ కల్చర్ ఉద్యోగులను ఎంతగా కుంగదీస్తోందో చాటిచెప్పే ఓ సంఘటన వెలుగుచూసింది. మూడేళ్లుగా వారానికి ఆరు రోజులు నిర్విరామంగా శ్రమిస్తున్న ఓ లేడీ ఇంజినీర్ తన ఆవేదనను సోషల్ మీడియా.. రెడిట్ వేదికగా పంచుకున్నారు. 2023లో ఐఐఐటీ నూజివీడుకు చెందిన చెందిన ఓ అమ్మాయి ఇంజినీరింగ్‌లో (Engineer) బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద నిర్మాణ రంగ సంస్థలో పనిచేస్తోంది. ఈ పని ఒత్తిడి వల్ల తన వ్యక్తిగత జీవితం పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను బాగా అలసటకు గురవుతున్నాను. ఆఫీస్ వేళలు ముగిసి ఇంటికి వచ్చేసరికి కనీసం ఇంట్లో పని చేసుకోవడానికి, కుటుంబ సభ్యులతో గడపడానికి కూడా ఓపిక ఉండట్లేదు. ఇక ఆదివారం కాస్తా వారం రోజుల అలసట నుంచి కోలుకోవడానికే సరిపోతోంది” అంటూ నిరాశను వ్యక్తం చేసింది.
ఈ విపరీతమైన పని ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఆమె ప్రస్తుతం ఉద్యోగం మారాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒకవేళ కొత్త ఉద్యోగంలో మంచి పని-జీవిత సమతుల్యత లభిస్తే, ప్రస్తుత జీతం కంటే తక్కువ జీతానికైనా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, సివిల్ ఇంజినీరింగ్ రంగంలో దాదాపు అన్ని కంపెనీలు వారానికి ఆరు రోజుల పనిని ఆశిస్తున్నాయి. దీంతో తనకు మరో మంచి అవకాశం దొరకడం సవాలుగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యువ ఇంజినీర్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో పని గంటలు, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై జరుగుతున్న చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.

