Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో రేవంత్ పర్యటన.. అధికార పార్టీ నేతలు అరెస్టు!

కలం, నల్లగొండ బ్యూరో: ముఖ్యమంత్రి పర్యటన అంటే సాధారణంగా జిల్లా యంత్రాంగంలో హడావుడి, ప్రతిపక్షాల్లో అలజడి కనిపిస్తాయి. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఇందుకు భిన్నంగా సాగుతోంది. ఇక్కడ ప్రతిపక్షాల కంటే అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, ప్రోటోకాల్ వివాదాలే ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అభివృద్ధి పనుల శంకుస్థాపనల కంటే, “ఎవరి ఫొటో ఉంది? ఎవరికి ఆహ్వానం దక్కింది?” అనే అంశాలే నల్లగొండ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

అధికారుల నిర్లక్ష్యమా? వ్యూహాత్మక నిర్లక్ష్యమా?

సీఎం నల్లగొండ పర్యటన (Revanth Nalgonda Visit) సందర్భంగా జిల్లాలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫొటో వివాదం. ఆర్ అండ్ బీ శాఖ ఇచ్చిన అధికారిక పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ ఫొటో మిస్ కావడం సాదాసీదా విషయం కాదు. గుత్తా సుఖేందర్ రెడ్డి కేవలం జిల్లా నేత మాత్రమే కాదు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో (శాసనమండలి చైర్మన్) ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం పక్కన ఉండాల్సిన ఆయన ఫోటో ను అధికారులు మర్చిపోవడం వెనుక కేవలం నిర్లక్ష్యమే ఉందా..? లేక స్థానిక రాజకీయ సమీకరణాలు ఏమైనా పనిచేశాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గుత్తా తీవ్రంగా పరిగణించి, అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవడం జిల్లా బ్యూరోక్రసీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

డీసీసీ వర్సెస్ మినిస్టర్..

నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు కొత్తేమీ కాదు. సీఎం స్వాగత ఫ్లెక్సీలలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఫొటో మాయమవ్వడం, ఆయనకు కనీసం ఆహ్వానం కూడా లేకపోవడం పార్టీ అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తోంది. జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రికి, డీసీసీ అధ్యక్షుడికి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే కైలాష్ నేతను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. “నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తా” అంటూ కైలాష్ నేత చేసిన హెచ్చరిక పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని, తీవ్ర అసంతృప్తిని సూచిస్తోంది. సొంత పార్టీ జిల్లా అధ్యక్షుడికి సీఎం సభకు ఆహ్వానం లేకపోవడం.. ఆహ్వానం లేకున్నా సభకు డిసిసి అధ్యక్షుడు హాజరవుతానంటే అరెస్టు చేస్తామంటూ సంకేతాలు ఇవ్వడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

మునుగోడు ముసలం.. లా అండ్ ఆర్డర్ సమస్య!

ఈ టూర్‌లో అత్యంత విచిత్రమైన పరిణామం మునుగోడు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సాధారణంగా సీఎం సభకు జనాన్ని తరలించాల్సిన అధికార పార్టీ నేతలను, ఇక్కడ పోలీసులే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇప్పట్లో విస్తరణ లేదనే సంకేతాలతో ఆయన వర్గం తీవ్ర అసహనంతో ఉంది. సీఎం సభలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మంత్రి పదవిపై నిలదీస్తారని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలను, నేతలను పోలీసులు పీఎస్ లకు తరలిస్తున్నారు. సొంత అనుచరులను అరెస్ట్ చేస్తుండటంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. మరోవైపు సీఎం సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఒక్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు.. మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం జన సమీకరణకు పాటుపడతారా లేకుంటే మొక్కుబడిగా సభకు హాజరై వెళ్ళిపోతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి నిరసనలు లేకుండా చూసుకోవడం పోలీసులకు ఒకెత్తైతే, సొంత పార్టీ నేతల అసంతృప్తి సభను చెడగొట్టకుండా చూసుకోవడం రేవంత్ రెడ్డి సర్కార్‌కు పెద్ద టాస్క్‌గా మారింది. ఈ మునుగోడు ఎపిసోడ్, ప్రోటోకాల్ వివాదం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. నల్గొండ కాంగ్రెస్‌లో లీడర్లు ఎక్కువయ్యారు.. సమన్వయం కరువైంది. అభివృద్ధి మంత్రంతో జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి ఈ గ్రూపు తగాదాలకు ఎలాంటి చెక్ పెడతారో.. ఈ రాజకీయ గందరగోళాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో వేచి చూడాలి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల అరెస్ట్

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసనకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో ప్లకార్డులతో నిరసన తెలపాలనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా పలువురు కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే యూత్ కాంగ్రెస్ నాయకుడు జంగిలి నాగరాజును పోలీసులు తెల్లవారుజామునే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన నాగరాజు పోలీస్ స్టేషన్ లోపలే బైఠాయించి నిరసనకు దిగారు. తెలంగాణ క్యాబినెట్‌లో సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తక్షణమే మంత్రి పదవి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన వేళ కాంగ్రెస్ సొంత పార్టీ నాయకులే అరెస్ట్ కావడం, పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆందోళనలు కొనసాగడం నల్గొండ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>