కలం, నిర్మల్ : ఖానాపూర్ (Khanapur) నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడెం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్‌లో బొద్దోనికుంట చెరువు పునరుద్ధరణ పనులు, నచ్చని ఎల్లాపూర్ నుండి సారంగాపూర్ వరకు రహదారి నిర్మాణ పనులు, అలాగే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సుమారు రూ.17 కోట్ల వ్యయంతో శంకుస్థాపనలు నిర్వహించారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక, తహసీల్దార్ సుజాత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

