కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణలో (Telangana) జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ (Congress) పార్టీ చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని బీజేపీ జాతీయ సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar Reddy) ఆరోపించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చేందుకు అనేక సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. నకిలీ ఓట్లను తొలగించి ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను రాజకీయ రంగు పులిమి కాంగ్రెస్ ప్రజలలో అపోహలు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.
గతంలో ఇదే విధమైన సవరణలను సమర్థించిన కాంగ్రెస్, ఇప్పుడు వ్యతిరేకించడం వారి ద్వంద్వ వైఖరిని చూపిస్తోందని అన్నారు.రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీపై, ప్రధాని మోదీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను బీజేపీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, ఎన్నికల సంఘం చేపడుతున్న పారదర్శక చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

