కలం, వెబ్ డెస్క్: నదీ జలాలపై కనీస అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానం.. నేడు తెలంగాణకు మరణ శాసనంగా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణకు దక్కాల్సిన నదీ జలాల నీటి వాటాలపై తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా రాష్ట్ర జలహక్కులను రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణను ముంచే ‘ముంపు మేస్త్రి’గా మారాడని మండిపడ్డారు. కేసీఆర్ పోరాడి సాధించిన ప్రాజెక్టుల అనుమతులను గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు. తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు.
ఆ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర అన్యాయం..
కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని రేవంత్ సంబరాలు చేసుకోవడం పూర్తిగా హాస్యాస్పదమని.. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన, రాజోలిబండ డైవెర్సన్ స్కీమ్ (RDS)కు ఎగువన 35 టీఎంసీల సామర్థ్యంతో ‘నవేలి రిజర్వాయర్‘ నిర్మాణానికి పూనుకుందని చెప్పారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ దిగువన, సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో ‘గుండ్రేవుల’ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఈ విధంగా ఇటు కర్ణాటక, అటు ఏపీ కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా చేస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.
ఉత్తమ్‌ను బయటే కూర్చోపెట్టారు..
కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణను ముంచుతుంటే.. అడ్డుకోవాల్సిన సీఎం వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. తుంగభద్ర నదిపై ఈ 55 టీఎంసీల నీటిని అటు కర్ణాటక, ఇటు ఏపీ ఆపేస్తే ఆ నీరు అల్టిమేట్‌గా శ్రీశైలం ప్రాజెక్టుకు రాదని అన్నారు. దీనివల్ల శ్రీశైలం డ్యామ్ పై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని (Minister Uttam), మన రాష్ట్ర ఇంజనీర్లను లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టారని అన్నారు.
చీకటి ఒప్పందం బయటపెట్టాలి..
మంత్రి ఉత్తమ్‌ను బయట కూర్చోపెట్టి.. ఏపీ అధికారితో సీక్రెట్ మీటింగ్ లో ముగ్గురు సీఎంలు చేసుకున్న ఆ చీకటి ఒప్పందం ఏంటో రేవంత్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగిందంటున్న రేవంత్ రెడ్డి.. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల న్యాయమైన వాటా సాధించారా లేదా స్పష్టం చేయాలన్నారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో ఏకంగా 383 టీఎంసీల అనుమతులు సాధిస్తే.. ఈ కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్లలో కనీసం ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించలేదని విమర్శించారు.
Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం!
Follow Us On: Instagram

